Site icon HashtagU Telugu

Doddi Komurayya: వీర యోధుడు దొడ్డి కొమురయ్య జయంతి.. పోరాట విశేషాలివీ

Doddi Komurayya Birth Anniversary Telangana Warrior Jangaon Devaruppula

Doddi Komurayya: నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్, స్థానిక దొరలకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య. ఇవాళ ఆయన జయంతి. కొమురయ్య  1927 ఏప్రిల్ 3న జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో జన్మించారు.  ఆయన తల్లిదండ్రులు గొర్రెలు పెంచేవారు. కొమురయ్య  అన్న దొడ్డి మల్లయ్య కమ్యూనిస్టు పార్టీలో గ్రామ నాయకుడిగా వ్యవహరించేవారు. పాలకుర్తి మండలం విస్నూర్‌కు చెందిన దేశ్‌ముఖ్‌ (దొర) రామచంద్రా రెడ్డి బంధువు జానమ్మ కడవెండిలోనే ఉండేది. ఈమె కడవెండి ప్రజలతో అతి క్రూరంగా వ్యవహరించేది. మనషులతో వెట్టిచాకిరి చేయించేది. సామాన్య ప్రజల నుంచి వడ్డీలు వసూలు చేయడంలో, రకరకాల శిక్షలను, జరిమానాలను విధించడంలో రాక్షసిగా జానకమ్మ పేరుగాంచింది.

Also Read :Poonam Gupta: ఆర్‌బీఐ కొత్త డిప్యూటీ గవర్నర్ నియామకం.. ఎవరీ పూనమ్ గుప్తా..?

1946 జూలై 4న ఏమైందంటే.. 

జానకమ్మ వల్ల అప్పట్లో కడవెండిలో భూమి, పంట, పశువులు, పారే నీళ్లపై జనాలకు హక్కులు ఉండేవి కావు. అప్పట్లో విస్నూర్ దేశ్‌ముఖ్ రామచంద్రా రెడ్డి పరిధిలో 60 గ్రామాలు ఉండేవి. జానమ్మ దొరసాని, ఆమె కుమారుడు బాబు దొర ప్రజలతో వెట్టిచాకిరీ చేయించుకునేవారు. దీంతో అక్కడి పీడిత ప్రజలు ఎర్ర జెండా నీడలో పోరు బాట పట్టారు. 1946 జూలై 4న ప్రజలు జానమ్మ, ఆమె గుండాల చర్యలకు వ్యతిరేకంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఆంధ్ర మహాసభకు జై అంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో దొడ్డి కొమురయ్య ధైర్యంగా పాల్గొన్నారు. ముందు వరుసలో నిలబడి ముందుకు సాగారు. అందరిలో ధైర్యాన్ని నింపారు.  దీంతో తనను వాళ్లంతా ఏం చేస్తారో అని  దొరసాని భయపడి.. తన గడి నుంచి మిస్కిన్ అలీతో(Doddi Komurayya) కాల్పులు జరిపించింది. దీంతో ముందు వరుసలో ఉన్న కొమురయ్య పొట్టలోకి బుల్లెట్లు దిగాయి. అయినా ఆంధ్ర మహాసభకు జై అంటూ నినాదాలు చేస్తూ ఆయన అమరుడయ్యాడు.

Also Read :Japan: మొన్న మ‌య‌న్మార్‌.. నేడు జపాన్‌లో భారీ భూకంపం!

దొడ్డి కొమురయ్య త్యాగంతో..

దొడ్డి కొమురయ్య త్యాగంతో యావత్  తెలంగాణ నిద్రలేచింది. నాటి నిజాం సంస్థానంలోని రైతు కూలీలు బందూకులను చేతపట్టి పోరాటం దిశగా అడుగులు వేశారు. 1946 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు. దీన్నే తెలంగాణా సాయుధ పోరాటం అని పిలుస్తారు.ఈ పోరాటం హైదరాబాద్ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. ఆంధ్ర మహాసభ.. కమ్యూనిస్టు పార్టీగా అవతరించింది. దీంతో దొడ్డి కొమురయ్య ప్రపంచ చరిత్రలో వీరుడిగా చిర స్థాయిగా నిలిచాడు.