CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు. ఎందుకంటే ఆయన ఈరోజు కర్ణాటకలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కర్ణాటకలోని గుర్మిట్కల్ పట్టణంలో జరిగే ఎన్నికల ప్రచార సభలో రేవంత్ ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు సేడంలో జరగనున్న ఎన్నికల ప్రచార సభకు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీతో కలిసి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) హాజరవుతారు.
We’re now on WhatsApp. Click to Join
కలబురగి లోక్‌సభ బరిలో ఖర్గే అల్లుడు
గుర్మిట్కల్ పట్టణం అనేది కలబురగి (గుల్బర్గా) లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. గతంలో కలబురగి లోక్‌సభ స్థానం నుంచి స్వయంగా మల్లికార్జున ఖర్గే ప్రాతినిధ్యం వహించేవారు. 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఖర్గేనే గెలిచారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ స్థానంలో ఖర్గేపై బీజేపీకి చెందిన ఉమేష్ జాధవ్ గెలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అల్లుడు రాధాక్రిష్ణ దొడ్డమణి కలబురగి స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలో ఎలాగైనా తన అల్లుడిని గెలిపించాలనే పట్టుదలతో ఖర్గే ఉన్నారు. ఈక్రమంలోనే ఖర్గే ఆహ్వానం మేరకు సీఎం రేవంత్ అక్కడి ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లినట్లు తెలిసింది. కర్ణాటకలో మొత్తం 28 పార్లమెంట్ స్థానాలుండగా, ఇప్పటికే 14 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. మిగిలిన 14 స్థానాలకు మే 7న మూడో విడతలో పోలింగ్ జరగనుంది.
Also Read :Betting Mafia : ఆశలతో వల.. అప్పులతో ఉరి.. కుటుంబాలు కూలుస్తున్న బెట్టింగ్ యాప్స్
కర్ణాటకలోని ఆ మూడు స్థానాలపై ఉత్కంఠ
- సీనియర్ రాజకీయ నాయకుడు కేఎస్ ఈశ్వరప్ప కర్ణాటకలోని శివమొగ్గ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇదే స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ సీఎం యడియూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్ర, కాంగ్రెస్ నాయకురాలు గీతా శివరాజ్‌కుమార్ బరిలో ఉన్నారు. తన కుమారుడికి లోక్‌సభ టికెట్ ఇచ్చేందుకు బీజేపీ నో చెప్పడంతో.. యడియూరప్ప కుమారుడిపై కేఎస్ ఈశ్వరప్ప రెబల్‌గా బరిలోకి దిగారు. ఈయన పోటీ వల్ల స్థానికంగా బీజేపీ ఓట్లు చీలుతాయని అంచనా వేస్తున్నారు. ఈ పరిణామంతో కాంగ్రెస్‌కు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు.
- కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై హవేరీ పార్లమెంటు స్థానం నుంచి ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ నేత ఆనందస్వామి గడ్డదేవర బరిలో ఉన్నారు.
- కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కర్ణాటకలోని ధార్వాడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈయనతో కాంగ్రెస్ నేత వినోద్ అసూటి తలపడుతున్నారు.