Hanuman Shobha Yatra హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా హనుమాన్ శోభాయాత్రలు నిర్వహించనున్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. హైదరాబాద్‌లో మొత్తం 168 శోభాయాత్రలు జరగనున్నాయని తెలిపారు. రెచ్చగొట్టే పోస్ట్‌లు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఏప్రిల్ 2వ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ జై శ్రీరాం, జై హనుమాన్ నినాదాలతో దద్దరిల్లిపోనుంది. భారీ ఎత్తున హనుమాన్ శోభాయాత్రను నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీసులు కూడా అలెర్ట్ అయ్యారు. హనుమాన్ శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవరైనా సరే సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
హనుమాన్ జయంతి సందర్భంగా పలు ప్రభుత్వ శాఖల అధికారులు, హనుమాన్ శోభాయాత్ర ఉత్సవ నిర్వాహకులతో మంగళవారం కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో సీపీ సజ్జనార్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీపీ సజ్జనార్ మెయిన్ శోభాయాత్రలో సుమారు 168 శోభాయాత్రలు కలవనున్నాయని, ఈ క్రమంలోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సుమారు 3 వేల మంది పోలీసులతో గట్టి నిఘా ఏర్పాటు చేసి గస్తీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
శోభాయాత్ర నిర్వహణలో పాల్గొనే వాలంటీర్లకు సరైన శిక్షణ ఇచ్చి, రోప్ పార్టీ సభ్యులను అధిక సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలని ఉత్సవ నిర్వాహకులకు సీపీ సజ్జనార్ సూచించారు. ఫ్లై ఓవర్లు, రైల్వే బ్రిడ్జిలు ఉన్న ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుని శోభాయాత్రను చేపట్టాలని పేర్కొన్నారు. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే వాహనాల మళ్లింపులు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు. సమావేశం తర్వాత గౌలిగూడ రామమందిరాన్ని దర్శించుకున్న సీపీ సజ్జనార్.. అక్కడి నుంచి తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వరకు ఉన్న 12 కిలోమీటర్ల ప్రధాన శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించారు. మరోవైపు.. శోభాయాత్ర సాగే ప్రాంతంలో రోడ్లపై చెత్తా చెదారం, మట్టికుప్పలు, రాళ్లు లేకుండా.. రోడ్డుపైకి పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించే పనులను జీహెచ్ఎంసీ అధికారులు పూర్తి చేశారు.
