మీకు పూరీ తినాలనుందా? కష్టం. మీకు దోశ తినాలని ఉందా? వద్దులే మళ్లీ వారం ట్రై చేద్దాం అని అనక తప్పదు. సరే.. ఇవన్నీ ఎందుకు ఉదయం పస్తు ఉండి.. మధ్యాహ్నం గట్టిగా ఫుల్ మీల్స్ లాగించేద్దాం అనుకుంటున్నారా… అయినా దాని రేటు చూస్తే.. తినకముందే ఆకలి చచ్చిపోతుంది. ఎందుకంటే.. హైదరాబాద్ లో ఇప్పుడు టిఫిన్ల ధరలు దారుణంగా పెరిగిపోయాయి. నిత్యావసరాల ధర పెరుగుదల ఎఫెక్ట్ వీటిపై కనిపిస్తోంది.
పూరీ కాని, వడ కాని, ఇడ్లీ కాని, బజ్జీ కాని.. ఏదైనా కాని తిందామని ఆశపడినా వాటి రేట్లు చూసి మనసు చంపుకోక తప్పని పరిస్థితి. ఎందుకంటే ప్లేటు టిఫిన్ రేటు ఐదు రూపాయిల నుంచి పది రూపాయిల వరకు పెరిగిపోయింది. ఇక భోజనంతోపాటు ఇతర వంటకాల ధర 15 రూపాయిల పైనే పెరిగింది. మామూలు హోటళ్లలో టిఫిన్ రేట్లు ఇప్పటివరకు సుమారుగా రూ.30-40 ఉంటే.. ఇప్పుడు ఆ రేటు కాస్తా రూ.50.. ఆ పైనే ఉంది. అదే భోజనం సంగతి చూస్తే.. మామూలు హోటళ్లలో రూ.90 ఉండేది. ఇప్పుడది రూ.110 అయిపోయింది. ఇక మధ్యస్థాయి హోటళ్లలో ఈ రేటు కాస్తా.. రూ.150 అయిపోయింది.
పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగడంతో పప్పుల ధరలు. 15-20 శాతం పెరిగాయి. నూనె ధర డబుల్ అయ్యింది. అంటే రూ.100 మేర పెరిగింది. వంట గ్యాస్ బండ బాదుడు బాదింది. ఎండుమిర్చి సంగతి చెప్పక్కరలేదు. అందుకే రంజాన్ నెలలో దొరికే హలీం రేటు కూడా పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్ లో అన్ని రకాల హోటళ్లు కలిపి దాదాపు 17 వేలు ఉండేవి. కరోనా దెబ్బకి చిన్నహోటళ్లు దాదాపు 2000 మేర మూతపడ్డాయి. ఇప్పుడు మిగిలిన హోటళ్లపై ఈ రేటు తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది.