Site icon HashtagU Telugu

Congress : కాంగ్రెస్ పై ముప్పేట దాడి.. ఆ మూడు పార్టీలదీ ఒకటే దారి..

Threefold Attack On Congress.. All Three Parties Are On The Same Path..

Threefold Attack On Congress.. All Three Parties Are On The Same Path..

By: డా. ప్రసాదమూర్తి

Telangana Congress Party : తెలంగాణ ఎన్నికల రణరంగం లో పోరు పోరాహోరీగా సాగుతోంది. ఎవరు పైకి ఎన్ని చెప్పినా, ఎన్ని చెప్తున్నా, తెలంగాణలో సామాన్య పౌరులకు కూడా ఒక విషయం తేటతెల్లమైపోయింది. కాంగ్రెస్ పార్టీని ఒంటరిని చేసి ఓడించడానికి ప్రధాన పక్షాలు ఒకటైనట్టుగా కనిపిస్తోంది. అధికార బీఆర్ఎస్ (BRS) కాంగ్రెస్ (Congress) మధ్యనే ప్రధానంగా పోటీ కేంద్రీకృతమైంది. మరోపక్క బీజేపీ కూడా రంగంలో ఉంది. ఆ పార్టీ క్రమంగా తన బలాన్ని తన చేజేతులా కిందికి దిగజార్చుకుంటున్నట్టు రాజకీయ విశ్లేషకులు స్పష్టంగానే చెబుతున్నారు. బిజెపి, జనసేన పార్టీతో కలిసి అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తుంది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీతో ప్రతిపక్ష పార్టీ తలపడాల్సి ఉంది. కానీ బిజెపి అగ్రనాయకత్వం నుండి రాష్ట్ర నాయకత్వం దాకా అందరూ మరో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ (Congress) పార్టీనే తమ మెయిన్ టార్గెట్ గా ప్రచారం కొనసాగిస్తున్నారు. తాము గద్దె దింపాల్సింది బీఆర్ఎస్ ని.

We’re Now on WhatsApp. Click to Join.

అలాంటప్పుడు తాము పోరాడాల్సింది కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పైనే కావాలి. రెండో లక్ష్యం కాంగ్రెస్ (Congress) కావచ్చు. కాంగ్రెస్ తో పాటు ఎంఐఎం కూడా బిజెపి లక్ష్యం కావచ్చు. కానీ విచిత్రంగా తెలంగాణలో బిజెపి తమ ప్రచార సభల్లో గాని, మీడియా ప్రకటనల్లో గాని పూర్తిగా కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగుతోంది. ఇప్పటికే బీజేపీని వదిలి వెళుతున్న నాయకులంతా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గాని, వివేక్ వెంకటస్వామి గాని నిన్న మొన్న కాంగ్రెస్ (Congress) లో చేరిన విజయశాంతి గాని అందరూ ఒకటే మాట చెబుతున్నారు. తాము గత పదేళ్ళుగా తెలంగాణను పరిపాలిస్తున్న బీఆర్ఎస్ ను ఓడించాలని ఒక లక్ష్యంగా బిజెపిలో చేరామని, కానీ బిజెపికి ఆ లక్ష్యసాధన ఉన్నట్టుగా ఆచరణలో కనిపించడం లేదని వారి వాదన. అవినీతి ప్రభుత్వం, కుటుంబ పాలన, ఆశ్రితపక్షపాతం, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో నిర్లక్ష్యం మొదలైన అంశాలను వారు ముందు పెట్టి వీటిపై బిజెపి పోరాడటం లేదని, కాంగ్రెస్ నే బిజెపి లక్ష్యంగా చేసుకొని ముందుకు వెళుతుందని, దీని ద్వారా అధికార బీఆర్ఎస్ కి బిజెపికి మధ్య ఉన్న అనుబంధం ఏమిటో తమకు స్పష్టంగా అర్థం అయిపోయిందని వారు చెబుతున్నారు.

అందుకే అనివార్యంగా బిజెపిని వదిలి అధికారంలో ఉన్న అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి కాంగ్రెస్లో చేరాల్సి వచ్చిందని ఆ నాయకుల వాదన. బిజెపి నుంచి వెళ్లిపోయిన నాయకులే ఇంత స్పష్టంగా చెబుతున్నారు. మరోపక్క ఆచరణలో బిజెపి కూడా ఎక్కడా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద దాడికి దిగడం లేదు. అడపా తడపా మాటల తూటాలు వదలడం తప్ప ఈ డి, సి బి ఐ, ఇన్ కమ్ టాక్స్ ఇలాంటి సంస్థలను ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదకు ఉసిగొల్పింది తప్ప అధికార బీఆర్ఎస్ నాయకుల మీదకు ఆ సంస్థలను వదిలిన ఉదాహరణలు లేవు. లిక్కర్ స్కాం విషయంలో, కవిత అరెస్టు విషయంలో బిజెపి ఎంత మెతక వైఖరి అవలంబించిందో ప్రజలందరూ చూశారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓడించడమే బిజెపికి ప్రధాన లక్ష్యంగా అందరికీ స్పష్టమవుతుంది. అన్ని రకాల బాణాలను బిజెపి కాంగ్రెస్ పార్టీపై వదులుతోంది.

తెలంగాణలో ముస్లిం మైనారిటీ వర్గంలో పూర్తి ప్రాబల్యం అన్న ఎంఐఎం పార్టీ కూడా కాంగ్రెస్ నే టార్గెట్ చేసుకొని తన ప్రచారాన్ని కొనసాగిస్తుంది. బీఆర్ఎస్ తో బిజెపి లోపాయికారి బంధం ఏమిటో బహిరంగంగానే అర్థమవుతున్నప్పటికీ ఎంఐఎం నాయకులు ఆ బంధాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. తమకు హిందుత్వ కార్డుతో దేశంలో రాజకీయాలు చేస్తున్న బిజెపి పార్టీ కంటే, కాంగ్రెస్ పార్టీయే ప్రధాన శత్రువుగా ఎంఐఎం నాయకులు భావిస్తున్నారు. అందుకే అసదుద్దీన్ ఓవైసీ నేరుగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి మీద కాషాయ రంగు పులమడానికి శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ ఇటు ఎంఐఎం కూడా రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ఎస్ తో సంబంధాలు ఉన్నట్టు తీవ్ర ప్రచారం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే రాష్ట్రంలోని ప్రజలకు చాలా గందరగోళంగా ఉంటుంది. ఎవరు ఎవరికి సంబంధించిన వాళ్ళో.. ఎవరు ఏం మాట్లాడుతున్నారో అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ అన్ని వైపుల నుంచి కాంగ్రెస్ ను ప్రధానమైన మూడు పక్షాలూ లక్ష్యం చేసుకొని ముట్టడిస్తున్నాయి అనే విషయం మాత్రం అందరికీ స్పష్టమవుతుంది.

దీనికి తోడు తెలంగాణలో పోటీకి దిగిన జనసేన పార్టీ ఆంధ్రా సెటిలర్ల ఓట్లను బిజెపి వైపు ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తోంది. అది కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేదే. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో పొత్తు ఉన్న జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేయడం ద్వారా తెలుగుదేశం అభిమానుల ఓట్లను కూడా తమ వైపు ఆకర్షించే అవకాశం ఉంది. తద్వారా కాంగ్రెస్ కి నష్టం చేకూర్చ వచ్చు. మరోవైపు సిపిఎం కూడా పోటీలో ఉంది. తాము పోటీ చేస్తున్న స్థానాలు మినహా మిగిలిన స్థానాల్లో బిజెపికి ఎవరు గట్టి పోటీ ఇస్తారో వారికి తమ అభిమానుల ఓట్లు పడతాయని సిపిఎం నాయకులు చెబుతున్నారు. వీరు కూడా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చే ఎన్నికల విధానాన్ని అవలంబిస్తున్నట్టుగా అర్థమవుతుంది. బీఎస్పీ పార్టీ కూడా ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ పార్టీ దళితుల ఓట్లను ఆకర్షించడం ద్వారా ఆ మేరకు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చ వచ్చని విశ్లేషకుల అంచనా. మొత్తం మీద ఎటు చూసినా కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పద్మవ్యూహంలో చిక్కుక్కుంది.

ఆ పార్టీని అష్టదిగ్బంధనం చేసి అపజయంపాలు చేయాలని, పైకి శత్రువులుగా తలపడుతున్న వారు కూడా మిత్రులుగా ఒకటయ్యారని అర్థం చేసుకోవచ్చు. ఈ వాతావరణంలో కాంగ్రెస్ ఏ విధంగా గెలుపు తలుపులు తెరుచుకొని విజయ పీఠం వైపు కదులుతుందో చూడాలి.

Also Read:  MLC Kavitha: మోడీ పాలనలో ఉప్పు, పప్పు, లాంటి నిత్యవసర ధరలు పెరిగాయి: కల్వకుంట్ల కవిత