Modi Hyderabad Tour : 2,3 తేదీల్లో హైదరాబాద్ లో మోడీ.. మూడంచెల భద్రతకు ఏర్పాట్లు

జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించనున్నారు.

  • Written By:
  • Publish Date - June 27, 2022 / 07:30 PM IST

జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించనున్నారు. నగరంలో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొననున్నారు. దీంతో పాటు జూలై 3న సాయంత్రం సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జరిగే భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈనేపథ్యంలో ప్రధాని మోడీకి హైదరాబాద్ లో మూడు అంచెల భద్రత కల్పించనున్నారు. ఇందుకోసం దాదాపు 5000 మంది పోలీసులను మోహరించనున్నట్లు తెలుస్తోంది. 3 అంచెల భద్రతా వలయం నడుం మోడీ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బహిరంగ సభ జరిగే పరేడ్ గ్రౌండ్, జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే హెచ్ఐసీసీ, నోవోటెల్ మైదానాల చుట్టుపక్కల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. ఇక స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ), ఇతర కేంద్ర భద్రతా బలగాల పహారా ఎలాగూ ఉంటుంది. వీరితో సమన్వయం చేసుకుంటూ హైదరాబాద్ పోలీసులు మోడీ భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే వేదికలోకి కూడా అతి తక్కువ మంది ఐపీఎస్ అధికారులనే అనుమతించడం గమనార్హం. ప్రధాని మోడీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రానున్నారు. ఈనేపథ్యంలో జూలై 2న హైదరాబాద్ లో వాతావరణం ఎలా ఉండొచ్చు? అనే దానిపైనా నివేదికలు తెప్పించుకున్నారు. ఆ రోజున 17 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంతోమంది కేంద్ర మంత్రులు హైదరాబాద్ కు రానున్నారు. వారంతా బేగంపేట ఎయిర్ పోర్టులో దిగి, అక్కడి నుంచి మాదాపూర్ హెచ్ఐసీసీకి వెళ్లనున్నారు. ఈనేపథ్యంలో ఈ రూట్ లో విమానాల ట్రయల్ రన్ ను కూడా చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల సీఎం లు, కేంద్ర మంత్రులకు భద్రత కల్పించేందుకు అదనపు బలగాలను సిద్ధంగా ఉంచుకోవాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, చుట్టుపక్క జిల్లాల పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.