Mulugu : ఛత్తీస్‌గఢ్ – తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో బుధవారం 22 మంది మావోయిస్టుల ఎన్‌కౌంటర్ జరిగింది. ఈక్రమంలోనే పోలీసులు,భద్రతా బలగాల సంయుక్త టీమ్ కూంబింగ్ నిర్వహిస్తుండగా మందుపాతర పేలింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రవరం తడపాల గుట్టలలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మృతిచెందినట్లు తెలుస్తోంది. మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలబట్టే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. చనిపోయిన పోలీసులు గ్రేహౌండ్స్ జవాన్లుగా సేవలు అందించేవారు. ముగ్గురు పోలీసుల మరణం వివరాలను ములుగు జిల్లా ఎస్పీ ఇంకా ధ్రువీకరించలేదు.
Also Read :Lahore Blasts: లాహోర్‌లో బాంబుల మోత.. వరుస పేలుళ్లతో వణుకు
బుధవారం రోజే అడవుల్లోకి..
బుధవారం రోజే తడపాల గుట్టలలోకి(Mulugu) పోలీసులు, కేంద్ర భద్రతా బలగాల సంయుక్త టీమ్ ప్రవేశించగా.. 24 గంటల్లోనే చేదు వార్త బయటికి వచ్చింది. ఆపరేషన్ కగార్‌తో తమకు సంబంధం లేదని వరంగల్ మల్టీజోన్ -1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి కొద్ది రోజుల క్రితమే తెలిపారు. ఇప్పుడు ముగ్గురు స్థానిక పోలీసుల మరణంతో కీలక విషయం వెలుగుచూసింది. కర్రెగుట్టల్లో గత 17 రోజులుగా జరుగుతున్న మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్‌లో స్థానిక పోలీసులు కూడా భాగమైనట్లు ఈ ఘటనతో స్పష్టమైంది.
మందుపాతరలతో డేంజర్ బెల్స్
ఇక కర్రెగుట్టల్లో మందుపాతరలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. గుట్టలో చాలాచోట్ల మందుపాతరలు పెట్టామని, అటువైపు అస్సలు రావొద్దంటూ గతంలోనే మావోయిస్టులు ఓ ప్రకటన విడుదల చేశారు. తాజా ఘటనను బట్టి మావోయిస్టులు చేసిన ప్రకటనలో వాస్తవికత ఉందనిపిస్తోంది. ఇప్పటివరకు కర్రెగుట్ట, పరిసర అడవుల్లో దాదాపు 200 మందు పాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు. ఇంకా ఎన్ని మందుపాతరలు యాక్టివ్‌గా భూమిలో ఉన్నాయో అంతుచిక్కడం లేదు. వాటన్నింటిని వెలికి తీసే వరకు పోలీసులు, భద్రతా బలగాలు చాలా జాగ్రత్తగా ఆపరేషన్ నిర్వహించాల్సి ఉంటుంది.