Site icon HashtagU Telugu

Hyderabad Rains : నాలాలో పడి చిన్నారి, పిడుగులు పడి మరో ముగ్గురు మృతి

Heavy Rains

సోమవారం అర్థరాత్రి నుంచి కురుస్తోన్న భారీ వర్షాలు(Heavy Rains) హైదరాబాద్(Hyderabad) లో జనజీవనాన్ని అస్తవ్యస్థం చేశాయి. రోడ్లపైకి మోకాలి లోతు వరకూ వర్షపు నీరు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీ వర్షాలతో నాలాలు పొంగిపొర్లుతుండగా(Floods).. ఓ బాలుడు ప్రమాదవశాత్తు నాలాలో పడి మృతి చెందాడు. ఈ ఘటన ప్రగతి నగర్లో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. నాలుగేళ్ల మిథున్ బాచుపల్లి నాలాలో గల్లంతవ్వగా.. వెంటనే కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఎంత వెతికినా మిథున్ ఆచూకీ లభించలేదు. నిజాంపేట రాజీవ్ గృహకల్ప వద్ద బాలుడి మృతదేహం కనిపించింది. అక్కడి నుంచి వెలికితీసే లోపే.. వరద ఉద్ధృతికి మళ్లీ కొట్టుకుపోయింది. నాలా ప్రవాహంతో బాలుడి మృతదేహం తుర్క చెరువులోకి కొట్టుకుపోగా.. అధికారులు గజఈతగాళ్లను రంగంలోకి దింపి తుర్క చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. డీఆర్ఎఫ్ బృందాలు మిథున్ మృతదేహాన్ని వెలికితీశారు. బాలుడు నాలాలో పడిపోతున్న దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ బాలుడి తల్లితండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు(Thunderstorms) పడి ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. చిట్యాల మండల కేంద్రానికి చెందిన చిలువేరు సరిత (30), నేర్పాటి మమత (32), పర్లపెల్లి భద్రమ్మ, ఆరేపల్లి కొమరమ్మ, మైదం ఉమా, కుమార్ అనే వ్యవసాయ కూలీలు మంగళవారం శాంతినగర్ శివారులో మిరప మొక్కలు నాటేందుకు వెళ్లారు. మధ్యాహ్నం భారీ వర్షం కురవగా.. వారంతా పక్కనే ఉన్న చెట్టుకిందికి చేరారు. చెట్టుపై పిడుగు పడటంతో సరిత, మమత అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా నలుగురికి తీవ్రగాయాలవ్వగా వారిని ఆసుపత్రికి తరలించారు. కాటారం మండలం దామెరకుంటలో పొలం పనిచేస్తున్న రాజేశ్వరరావు(46)పై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

Exit mobile version