Site icon HashtagU Telugu

Drugs In Hyderabad : హైద‌రాబాద్‌లో భారీగా డ్ర‌గ్స్ స్వాధీనం.. ముగ్గురు విదేశీయులు అరెస్ట్‌

Drugs

Drugs

హైదరాబాద్‌లో కొకైన్, ఎండీఎంఏతో ముగ్గురు విదేశీ డ్రగ్స్ వ్యాపారులు ప‌ట్టుబ‌డ్డారు. డ్రగ్స్‌ విక్రయిస్తున్నారనే ఆరోపణలపై హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ అధికారులు, బంజారాహిల్స్‌ పోలీసుతో కలిసి శుక్రవారం ముగ్గురు విదేశీయులు, స్థానికులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కోటి రూపాయల విలువైన పలు వస్తువులను పోలీసు బృందం స్వాధీనం చేసుకుంది. నిందితులను అగ్బోవో మాక్స్‌వెల్ న్నాబుయిసి (37), ఓకేకే చిగోజీ బ్లెస్సింగ్, 32, ఇకెమ్ ఆస్టిన్ ఒబాకా, 41, అందరూ నైజీరియా నివాసితులుగా గుర్తించారు. మరో నిందితుడు హైదరాబాద్ వాసి పి సాయి అకేష్ (25)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విదేశీ డ్రగ్స్ వ్యాపారులు బెంగళూరులో మకాం వేశారని.. నిందితుడు, అగ్బోవో మాక్స్‌వెల్ ప్రధానంగా ముంబైలో డ్రగ్స్ వ్యాపారంలో నిమగ్నమై, ఆ తర్వాత బెంగళూరుకు వెళ్లాడని తెలిపారు.

బెంగళూరులో మాక్స్‌వెల్ క్వేకు ఎస్సుమాన్ క్వామే పేరుతో నకిలీ నైజీరియన్ పాస్‌పోర్ట్, వీసా పొందాడని తెలిపారు. ఆ తర్వాత నకిలీ ధ్రువీకరణ పత్రాలతో ఇంటిని అద్దెకు తీసుకుని డ్రగ్స్‌ వ్యాపారం చేయడం ప్రారంభించాడని.. కాలేజీ విద్యార్థులను మాక్స్‌వెల్ టార్గెట్ చేసేవాడని పోలీసులు తెలిపారు. ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసిన తర్వాత మాత్రమే వినియోగదారులకు డ్రగ్స్‌ అందించేవారు. మాక్స్‌వెల్‌, అతని స్నేహితుడు మేజీ ఇతర నిందితులతో టచ్‌లోకి రావడంతో హైదరాబాద్‌కు అక్రమ వ్యాపారాన్ని విస్తరించారని తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 100 గ్రాముల కొకైన్, 300 గ్రాముల MDMA, ఐదు మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన వినియోగదారులను గుర్తించేందుకు విచారణ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు డ్రగ్స్‌ బారిన పడవద్దని హైదరాబాద్‌ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సంఘ విద్రోహ కార్యకలాపాలను అరికట్టేందుకు తల్లిదండ్రులు పిల్లలపై నిఘా ఉంచాలని కోరారు.