Tigers Killing : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ అడవుల్లో రెండు పులులు మృతిచెందిన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో మిస్టరీ వీడింది. పులులను చంపిన ముగ్గురు నిందితులను అటవీ అధికారులు గుర్తించారు. ఆసిఫాబాద్ డివిజన్ వాంకిడి మండలం రెంగరీట్ గ్రామానికి చెందిన కోవా గంగు, ఆత్రం జల్‌పతితో పాటు 11 ఏళ్ల బాలుడు విషప్రయోగం చేసిన వారిలో ఉన్నట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. పులులను చంపాలనే ఉద్దేశంతోనే పశువు కళేబరంపై విషం చల్లి ఎరగా వేశామని నిందితులు విచారణలో అంగీకరించారు. విషం చల్లిన కళేబరంలోని మాంసాన్ని తిన్న రెండు పులులు చనిపోయాయి. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని.. సీన్‌ను రీకన్‌స్ట్రక్షన్ చేశారు. పశువులపై పులులు దాడి చేసి చంపేస్తున్నందు వల్లే… వాటికి విషం పెట్టామని నిందితులు చెప్పారు. వీరిలో గంగు, జలపతికి కోర్టు 12 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. ఇక మైనర్‌ను పేరెంటల్ బాండ్‌పై రిలీజ్ (Tigers Killing) చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగజ్‌నగర్ ఫారెస్ట్‌లో జనవరి 6న దరిగాం ఏరియాలో పులి పిల్ల కళేబరం దొరకగా.. రెండు రోజుల తర్వాత జనవరి 8న మగ పులి కళేబరం దొరికింది. పులుల మధ్య జరిగిన ఘర్షణలో పులి పిల్ల చనిపోయిందని మొదట అధికారులు భావించారు. అయితే ఆ వెంటనే మగపులి చనిపోవటం దానికి ఉచ్చు బిగిసి ఉండడం, విషప్రయోగం జరిగినట్లు తేలడంతో వీటి మరణం వెనుక వేటగాళ్ల పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ దిశగా విచారణ చేపట్టారు. అయితే మరో పులి కూడా విషం కలిసిన ఆవు కళేబరం తిన్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డు కాగా.. దాని జాడ కోసం అధికారులు వేట కొనసాగిస్తున్నారు.
Also Read: Rakesh Sharma – 75 : రాకేష్ శర్మ 75వ బర్త్ డే.. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడి విశేషాలు
పెద్దపులుల కదలికలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అలజడి సృష్టిస్తున్నాయి. పొరుగున ఉన్న మహారాష్ట్రలోని తడోబా వన్యప్రాణి విభాగం నుంచి ప్రాణహిత నది దాటి కాగజ్‌నగర్, జైపూర్, చెన్నూరు వరకు కారిడార్‌గా ఏర్పడి పెద్దపులులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వలస వస్తున్నాయి. ఈక్రమంలో వాటి ఆవాసం, సంరక్షణ గురించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా పెన్‌గంగ నదీ పరివాహక ప్రాంతం పరిధిలోని తాంసి కె, భీంపూర్ మండలాల్లో రెండునెలల పాటు పులుల సంచారం పెరుగడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు హడలెత్తిపోయారు. మైదాన ప్రాంతాల్లోకి పులులు రావడంతో ఇక్కడి ప్రజలు హైరానా పడగా ఆతర్వాత తిరిగి మహారాష్ట్రలోని తడోబా ప్రాంతానికి వెనక్కి వెళ్లడంతో ఊపిరి పీల్చుకున్నారు.