తగ్గేదేలే.. ఇది ‘మా’ రాజకీయం.!

మాటల యుద్ధాలు.. ఆరోపణ పర్వాలు.. సవాళ్లకు ప్రతిసవాళ్లు.. నువ్వానేనా అన్నట్టు సాగుతున్నాయి ప్రస్తుత తెలంగాణ రాజకీయాలు. అయితే ఒకవైపు హుజూరాబాద్ ఉప ఎన్నిక తీవ్ర ప్రకంపనలు రేపుతుంటే.. మరోవైపు ‘మా’ ఎన్నికలు సైతం రసవత్తరంగా మారుతున్నాయి.

  • Written By:
  • Updated On - October 9, 2021 / 03:29 PM IST

మాటల యుద్ధాలు.. ఆరోపణ పర్వాలు.. సవాళ్లకు ప్రతిసవాళ్లు.. నువ్వానేనా అన్నట్టు సాగుతున్నాయి ప్రస్తుత తెలంగాణ రాజకీయాలు. అయితే ఒకవైపు హుజూరాబాద్ ఉప ఎన్నిక తీవ్ర ప్రకంపనలు రేపుతుంటే.. మరోవైపు ‘మా’ ఎన్నికలు సైతం రసవత్తరంగా మారుతున్నాయి. గత రెండు వారాల క్రితం పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘రిపబ్లిక్’ మూవీ ఆడియో ఫంక్షన్ లో ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడటంతో పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. అప్పట్నుంచీ ‘పవన్ వర్సస్ వైసీపీ’ అన్నట్టుగా మారిపోయింది సీన్. ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థ చిలికిచిలికి గాలివానలా మారింది. ఇప్పుడే ఇదే సీన్ ‘మా’లోనూ కనిపిస్తోంది. తెర వెనుక మోహన్ బాబు, చిరంజీవి ఉన్నప్పటికీ, తెర ముందు మాత్రం మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ మధ్య యుద్ధ నడుస్తోంది. వీళ్లద్దరి మధ్య పచ్చగడ్డి వేసే భగ్గుమనే స్థాయికి వెళ్లారు. ఈ ఇద్దరు నాయకత్వం వహిస్తున్న 56 మంది సభ్యుల కార్య నిర్వాహక కమిటికీ రేపు ఎన్నికలు జరగనున్నాయి. పేరుకు మా ఎన్నికలైనప్పటికీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోవడం లేదు. ఇప్పటివరకు మాటల యుద్ధానికి పరిమితమైన ప్రచారం బెదిరింపుల స్థాయికి వెళ్లిందంటే.. ‘మా’ పరిస్థితి ఎలా ఉందో స్పష్టమవుతోంది.

ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యురాలు హేమ ఫిర్యాదు చేసింది. ఇంకా ఏవో ఆధారాలున్నాయని భయపెడుతున్నారంటూ హేమ చెప్పుకొచ్చింది. హేమ కామెంట్స్ కు మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు కరాటే కళ్యాణి కౌంటర్ ఇచ్చారు. ‘ హేమ ఎవరికి కంప్లైంట్ ఇచ్చిన తమకు అవసరం లేదన్నారు. ఆఫీషియల్ వాట్సాప్ గ్రూప్ లో ఏ యే ఫోటోలు పంపి.. డిలీట్ చేస్తోన్నావో చాలామందికి తెలుసునని… ఎక్కువ మాట్లాడితే.. అన్ని బయటకు తీయాల్సి వస్తోంది’ అంటూ కరాటే కళ్యాణి హెచ్చరించడం కూడా గొడవకు దారి తీసింది.

ఇక పోస్టల్ బ్యాలెట్ కూడా తీవ్ర చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఈవీఎం వాడకూడదని, పోస్టల్ బ్యాలెట్ ద్వారా మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని మంచు విష్ణు ప్యానెల్ డిమాండ్ చేయడం కూడా చర్చనీయాంశమైంది. ఈ విషయమై ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్ ద్వారా.. విష్ణు అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉందని, నిజాయితీగా ఎదుర్కొనలేక విష్ణు నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా దుమారమే రేపిందని చెప్పక తప్పదు.

ఎన్నడూ లేనతంగా ‘లోకల్, నాన్ లోకల్’ ప్రస్తావన కూడా తీవ్ర చర్చకు దారితీసింది. ఇదే ఈ విషయమై మంచు విష్ణు మాట్లాడుతూ ‘మా’ పూర్తిగా తెలుగు నటులకు సంబంధించిందనీ, బయటి రాష్ట్రాల వ్యక్తులు ‘మా’ పోటీలో ఎలా నిలుస్తారంటూ? ఎదురుదాడికి దిగడం చూస్తే.. మా రాజకీయాలు మరింత ముదిరాయని చెప్పొచ్చు. మొత్తంగా మా రాజకీయాలు చిరంజీవి వర్సెస్ మోహన్ బాబు గా మారాయని సినీ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో రేపు మా ఎలక్షన్ జరగనున్నాయి. 24 గంటలు గడిస్తే ‘మా’ అధ్యక్షుడు ఎవరు అనేది తెలిసిపోనుంది. ఎవరి బలాలు ఏంటో బయటపడతాయి.. అప్పటివరకు వేచి చూడాల్సిందే మరి.