Pravallika Suicide: హాస్టల్‌లో ఉరివేసుకుని ప్రవళిక అనే గ్రూప్-2 విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. పరీక్ష వాయిదా పడటం, ఉద్యోగం రాదనే బెంగతో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై స్వయంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర సీఎస్, డీజీపీ, TSPSC కార్యదర్శిని ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రవళిక ఆత్మహత్య ఎంతో మంది నిరుద్యోగులను కదిలించింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా చేసంది. అయితే ప్రవళిక ఆత్మహత్య అనేక అనుమానాలు ఉన్నప్పటికీ నిరుద్యోగం వల్లనే చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె తల్లి మీడియా ముందుకొచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘‘మా అమ్మాయి పేరు మర్రి ప్రవళిక. రెండు సంవత్సరాల నుంచి నేను నా బిడ్డను అక్కడ చదివించుకుంటున్న. నా కొడుకు కూడా అక్కడే చదువుకుంటున్నాడు. మేమే ఎండల కాయ కష్టం చేసి పిల్లలను చదివిస్తున్నాం. మా పిల్లలకు ఆ కష్టం రాకూడదు అని అక్కడ పంపి చదివిపిస్తున్నాం. కానీ, వాడు మా పిల్లను వేధించాడు. వాడి టార్చర్ భరించలేక మా అమ్మాయి కనీసం మాతో కూడా చెప్పుకోలేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నా బిడ్డను చావుకు కారణమైన వాడిని శిక్షించాలి.
వాడిని బయటకు రాకుండా చేయాలి. నా బిడ్డ కష్టం వేరే వాళ్లకు రాకూడదు. మీకు పార్టీల పరంగా ఏమైనా గొడవలు ఉంటే మీరు చూస్కోండి అంతే కానీ మా కుటుంబాన్ని అందులో లాగకండి. నా బిడ్డను చావుకు కారణమైన వాడిని మాత్రం బయటకు రానీయకండి. నా బిడ్డ మాదిరిగానే వాడికి శిక్ష వేయండి’’ అంటూ వీడియోలో తన బాధను వ్యక్తం చేసింది.
Also Read: Revanth Reddy: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం, నిరుద్యోగురాలికి రేవంత్ రెడ్డి హామీ!