TGSRTC: తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC) యాజమాన్యం, కొందరు యూనియన్ నాయకులు సంస్థపై చేస్తున్న నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. సంస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని, ఉద్యోగులు ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మి గందరగోళానికి గురికావొద్దని యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉందని, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పెండింగ్ అంశాలను త్వరలోనే పరిష్కారం అవుతాయని, ఎలాంటి గందరగోళానికి గురికావొద్దని స్పష్టం చేసింది.
యూనియన్ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ స్కీమ్ (ఎస్‌ఆర్‌బీఎస్) రద్దు చేస్తున్నారని అసత్య ప్రచారం చేస్తూ ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని యాజమాన్యం ఆరోపించింది. ఎస్‌ఆర్‌బీఎస్ మూసివేత ప్రతిపాదనే సంస్థ ముందుకు తీసుకురాలేదని, ఈ అంశాన్ని కావాలనే తప్పుదోవ పట్టించేందుకు కొందరు ఉపయోగిస్తున్నారని స్పష్టం చేసింది. సంస్థలో ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని యాజమాన్యం తేల్చిచెప్పింది.
Also Read: TTD Chairman BR Naidu: టీటీడీ ప్రతిష్టను దిగజార్చే కుట్ర జరుగుతోంది: చైర్మన్ బీఆర్ నాయుడు
గత మూడున్నరేళ్లుగా కొందరు యూనియన్ నాయకులు తమ మనుగడ కోసం ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, అయితే ఉద్యోగులు ప్రతిసారీ ఈ కుట్రలను తిప్పికొట్టి, ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతానికి మద్దతు తెలిపారని యాజమాన్యం పేర్కొంది. సంస్థకు ఎంతో కాలం సేవలందించి, పదవీ విరమణ తర్వాత బయటకు వెళ్లి నిరాధార ఆరోపణలతో ప్రతిష్ఠకు భంగం కలిగించడం సరికాదని హితవు పలికింది.
యాజమాన్యం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పెండింగ్‌లో ఉన్న అంశాలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఉద్యోగులు నిరాధార ఆరోపణలను నమ్మరని, సంస్థ వెన్నంటి నిలబడతారని యాజమాన్యం విశ్వాసం వ్యక్తం చేసింది. యూనియన్ నాయకులు ఇప్పటికైనా దుష్ప్రచారాన్ని మానుకోవాలని సూచించింది.