Site icon HashtagU Telugu

Secunderabad Cantonment: గద్దర్ కుమార్తె వెన్నెలకు టికెట్, కాంగ్రెస్ వ్యూహం ఇదే!

Gaddar Daughter Vennela

Gaddar Daughter Vennela

Secunderabad Cantonment: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని గట్టిగా నిర్ణయించుకుంది. అందుకే ఆచితూచి అడుగులు వేస్తూ టికెట్లను కేటాయిస్తోంది. అధికార పార్టీ బీఆర్ఎస్ ను ఢీకొట్టేందుకు ఏ ఒక్క అస్త్రాన్ని వీడటం లేదు. తాజాగా ప్రకటించిన రెండో జాబితాలో ప్రజాయుద్దనౌక గద్దర్ కుమార్తె డాక్టర్ జీవీ వెన్నెలకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్ కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో ఆమె సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి వెన్నెల బరిలోకి దిగుతున్నారు. గద్దర్ తాను చనిపోవడానికి ముందు కాంగ్రెస్ పార్టీతో చనువుగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం కూడా జరిగింది.

ఆయన చనిపోయాక టీపీసీ చీఫ్ రేవంత్ ఇతర కాంగ్రెస్ నేతలు దగ్గరుండి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే ఆయన కుటుంబానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. అయితే ఆ తర్వాత గద్ధర్ కుటుంబం పేరు వార్తల్లో ఎక్కడా కనిపించలేదు. దీంతో టికెట్ కేటాయిస్తారా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రెస్‌మీట్ నిర్వహించిన గద్దర్ భార్య విమల, కుమార్తె వెన్నెల.. తమకు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేదని కానీ ఆ పార్టీ సానుభూతిపరులమన్నారు.

కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా , ఇవ్వకపోయినా ఎన్నికల బరిలో నిలుస్తామని వెన్నెల స్పష్టం చేశారు. దీంతో కంటోన్మెంట్‌లో పార్టీకి నష్టం జరగకుండా వెన్నెలకు కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. ఇక వెన్నెలకు టికెట్ కేటాయించటం వెనుక కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అక్కడ బీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత పోటికి దిగుతున్నారు. తన తండ్రి మృతి, మహిళ సెంటిమెంట్‌తో ఆమె బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ వ్యూహానికి చెక్ పెట్టేలా అదే సెంటిమెంట్ ప్లాన్‌తో వెన్నెలకు బరిలోకి దింపుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక గద్దర్ బిడ్డకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంతో ఇతర పార్టీలు కూడా స్వాగతిస్తున్నట్టు తెలుస్తోంది.

Exit mobile version