Army Aspirants: ఇది స్కీం కాదు స్కాం.. ఆర్మీ అభ్యర్థుల కన్నీటి కథ!

రెండున్నర సంవత్సరాల క్రితం అంటే కరోనాకి ముందు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ద్వారా ఉద్యోగ భర్తీ కోసం ఒక ప్రకటన చేశారు.

  • Written By:
  • Updated On - June 18, 2022 / 01:49 PM IST

రెండున్నర సంవత్సరాల క్రితం అంటే కరోనాకి ముందు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ద్వారా ఉద్యోగ భర్తీ కోసం ఒక ప్రకటన చేశారు. ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ పూర్తి చేశారు. మెడికల్ టెస్ట్ సమయంలో ఎంత హ్యుమిలేషన్ ఉంటుందో, ఆర్మీ వాళ్ళు ఎన్ని భూతులు తిడుతారో మాటల్లో చెప్పలేం. అయినా ఉద్యోగం వస్తే ఇంట్లో వాళ్ళకి తోడుగా ఉంటామని అన్నీ భరించాం. అప్పులు తెచ్చి మరి కోచింగ్ తీసుకున్నాం.  కరోనా ఉందని, ఇంకో సాకు చూపించి రెండేళ్లుగా రాత పరీక్షను వాయిదా వేస్తూ వచ్చారు. రేపో మాపో పరీక్ష ఉంటుందని, అటు వారం తర్వాత రిజల్ట్ వస్తోందని ఆశగా ఎదురుచూస్తున్నాం. సడెన్ గా ఈ నోటిఫికేషన్ రద్దైందని ప్రకటించారు. ఈ ఉద్యోగం వస్తుందని నమ్మకంతో మద్యలో వచ్చిన నోటిఫికేషన్స్ కి అప్లయ్ కూడా చేయలేదు.

ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం నూతన విధానం ఉంటు౦దని ప్రకటించిన కేంద్రం దానిలో పెట్టిన వయస్సు నిబంధనలు మాలో చాల మందికి వర్తించవు. మా రెండు సంవత్సరాల సమయాన్ని వృధా చేసిన కేంద్రం కేవలం పరీక్ష పెడితే అయిపోయే సమయంలో  నోటిఫికేషన్ రద్దు చేయడం ఏంటి? ఎన్నికైన ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం పెడితే నానా హైరానా పడే ప్రభుత్వాలు, ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు అంటే మేమెంత ఇబ్బంది పడుతామో ఆలోచించదా? ఇచ్చిన నోటిఫికేషన్ కి పరీక్ష పెట్టమనేదే మా ప్రధానమైన డిమాండ్.

ఇక నూతన విధానమైతే ఎంత ప్రమాదకరమైన ఆలోచనో.. నాలుగు సంవత్సరాలు పని చేసి మమ్మల్ని పక్కన పెడితే అప్పుడు మాకు ఏ జాబ్ వస్తుంది? నాలుగు సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇచ్చే పది లక్షలు దేనికి పనికొస్తాయి. వెపన్ నేర్చుకున్న మేం అసహనంతో ఉగ్రవాదులమైతే దేశానికి ఎంత ప్రమాదం. ఈ ఆందోళన వెనక ప్రతిపక్షాలు ఉన్నాయని అంటున్న బిజెపి నేతలను ఇప్పుడు ఒక్క మాట కూడా అనం. ఎన్నికల కోసం మా ఇండ్లల్లకు వచ్చినప్పుడు దేనితో సన్మానం చేయాలో దానితోనే సన్మానం చేస్తాం. చివరగా ఒక్క మాట, కేంద్రం నూతనంగా తెచ్చింది స్కీం కాదు.. స్కాం..