రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad) నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రకాశ్ అంబేద్కర్‌తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ సందర్భంగా బౌద్ధ భిక్షవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహంపై హెలికాప్టర్ ద్వారా గులాబీ పూల వర్షం కురిపించారు. ఆ పూల వర్షాన్ని సీఎం కేసీఆర్, ప్రకాశ్ అంబేద్కర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు వీక్షించారు. ఈ సందర్భంగా కేసీఆర్ జై భీమ్ అని నినదించారు. అక్కడున్న ప్రజాప్రతినిధులంతా చప్పట్లతో పూల వర్షాన్ని స్వాగతించారు. అంబేద్కర్ విగ్రహా (Staute) శిలాఫలకాన్ని ప్రకాశ్ అంబేద్కర్ ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.
అంబేడ్కర్ జయంతి (BR Ambedkar) సందర్భంగా.. ఇకపై ఏటా ఆయన పేరిట అవార్డులు ప్రదానం చేయనున్నట్లు సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించారు. కత్తి పద్మారావు సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అవార్డుల కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రూ.51 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు, దేశమంతా ఏటా 25 లక్షల కుటుంబాలకు దళితబంధు ఇచ్చే రోజు త్వరలో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో అంబేడ్కర్ మహా విగ్రహావిష్కరణలో కేసీఆర్ మాట్లాడారు. అంబేడ్కర్ సిద్ధాంతాలు స్మరణకు వచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. తెలంగాణ కలలు సాకారం చేసుకునే చిహ్నం ఈ విగ్రహం అని కెసిఆర్ (CM KCR) అభివర్ణించారు. విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.