Site icon HashtagU Telugu

Bandi Sanjay: ఆగస్టు 2 నుండి బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర షురూ

Bandi Imresizer

Bandi Imresizer

– ఈ నెల 21 నుంచి నియోజకవర్గాల్లో ‘పల్లె గోస – బీజేపీ భరోసా’ పేరుతో బైక్ ర్యాలీలు
– సోమవారం కరీంనగర్‌లో ‘మౌన దీక్ష’
– బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ వెల్లడించారు
– నర్సంపేట నియోజకవర్గ టీఆర్‌ఎస్ నాయకులు తరుణ్ చుగ్, సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టనున్న మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర తేదీ ఖరారైంది. ఆగస్టు 2 నుంచి 20 రోజుల పాటు పాదయాత్ర చేయనున్నారు. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ ప్రకటించారు.

ఈరోజు సాయంత్రం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ కుమార్, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, పన్నాల శ్రీరాములు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బంగారు శృతి, రాష్ట్ర నాయకులు రాజ్ వర్ధన్ రెడ్డిలతో కలిసి తరుణ్ చుగ్ మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానున్న మూడో దశ ప్రజాసంగ్రామ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. అదే విధంగా బండి సంజయ్ రేపు కరీంనగర్ లో బంజరు భూములు, ధరణి సమస్యలపై ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ‘మౌన దీక్ష’ చేపట్టనున్నారు.
అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటంలో భాగంగా ఈ నెల 21 నుంచి ‘పల్లె గోస – బీజేపీ భరోసా’ పేరుతో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బైక్ ర్యాలీలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. బండి సంజయ్ నేతృత్వంలో దాదాపు 30 మంది సీనియర్ నాయకులు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించి రాత్రికి గ్రామాల్లో బస చేయనున్నారు.

రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ పాలనలో అల్లాడుతున్న ప్రజలకు న్యాయం జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆజాదీ కా అమృతోత్సవ్‌ నేపథ్యంలో ఆగస్టు 9 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రంలోని ప్రతి బీజేపీ కార్యకర్త తమ ఇళ్లలో జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
మరోవైపు నర్సంపేట నియోజకవర్గానికి చెందిన పలువురు టీఆర్‌ఎస్ నాయకులు ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తరుణ్ చుగ్, బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. మాజీ ఎంపీపీ గటిక అజయ్‌కుమార్‌, మాజీ ఎంపీటీసీ గోపాల్‌, సర్పంచ్‌ వడ్డె రజిత సహా వందలాది మంది టీఆర్‌ఎస్‌ నాయకులు బీజేపీలో చేరారు. తరుణ్ చుగ్, బండి సంజయ్ బీజేపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

Exit mobile version