Vem Narender Reddy : ‘‘నా పేరుతో వసూళ్లు చేసే వాళ్లను నమ్మకండి’’.. వేం నరేందర్ రెడ్డి ప్రకటన

ఇక నుంచి ఎవరైనా తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.

Published By: HashtagU Telugu Desk
Cm Revanth Vem Narender Reddy

Vem Narender Reddy : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, సీఎం రేవంత్‌ రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్‌రెడ్డి పేరు వాడుకొని ఉద్యోగాలు, డబుల్‌ బెడ్‌ రూంలు ఇప్పిస్తామంటూ కొందరు మోసాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఇవాళ ఉదయం వేం నరేందర్‌రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ఇటీవల కొందరు వ్యక్తులు నా పేరును వాడుకొని డబుల్ బెడ్ రూమ్‌లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ట్రాన్స్‌ఫర్లు చేయిస్తామని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారు.ఈవిషయం తెలిసిన వెంటనే నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను’’ అని ఆయన వెల్లడించారు. తన ఫిర్యాదును అందుకున్నాక.. తన పేరుతో మోసాలకు పాల్పడుతున్నవారిని రాచకొండ పోలీసులు అరెస్టు చేసిన విషయాన్ని వేం నరేందర్‌రెడ్డి గుర్తు చేశారు. ఇక నుంచి ఎవరైనా తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. ప్రజలు కూడా ఇలాంటి మోసపూరిత వ్యక్తుల మాటలు నమ్మొద్దని కోరారు. తన పేరు చెప్పుకొని ఎవరైనా ఫోన్ కాల్స్ చేస్తే నేరుగా తమ ఆఫీస్ సిబ్బందిని వాట్సాప్ నంబరు 7566663335 ద్వారా సంప్రదించాలని వేం నరేందర్ రెడ్డి(Vem Narender Reddy) కోరారు.

We’re now on WhatsApp. Click to Join

ప్రభుత్వ ఉద్యోగాలు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తామంటూ 107 మందికి టోకరా వేసి రూ.1.29 కోట్ల వసూలు చేసిన ముఠా సభ్యులను ఇటీవలే తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. ముఠా నాయకుడు అనుగు సురేందర్‌ రెడ్డి (34)తో పాటు మెరీనా రోస్‌ (52), బొలుగుల అంజయ్య (34), బండ వెంకటేష్‌ (55), కర్తావత్‌ గోపాల్‌ నాయక్‌ (48), అనుగు హర్షిణి రెడ్డి (33)లను మల్కాజిగిరి ఎస్‌ఓటీ, కీసర పోలీసులు అరెస్ట్‌ చేశారు. వేం నరేందర్‌ రెడ్డి ఫిర్యాదు మేరకు వీరి అరెస్టు జరిగింది. నిందితుల వద్ద నుంచి డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నకిలీ ఆలాట్‌మెంట్‌ లెటర్లు, కీసర ఆర్డీవో స్టాంపులు, 8 మొబైల్‌ ఫోన్లు, రూ. 1.97 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Also Read :Nagarjuna : ‘బిగ్‌బాస్’ నుంచి నాగార్జునను తప్పించండి.. హేతువాది బాబు గోగినేని సంచలన ట్వీట్

  • వివరాల్లోకి వెళితే.. కుషాయిగూడకి చెందిన అనుగు సురేందర్‌ రెడ్డి కుషాయిగూడ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో క్యాటరింగ్‌ పని చేసేవాడు. అతడు పలు సోషల్‌ వెల్ఫేర్‌ పాఠశాలల ప్రిన్సిపాళ్లకు ఫోన్లు చేసి తాను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని అంటూ మాట్లాడేవాడు. తాను పంపించే వాళ్లను కాంట్రాక్టు అధ్యాపకులుగా ఉద్యోగాలివ్వాలని ఆదేశించేవాడు. అతడి మాటలు నమ్మి ప్రిన్సిపాళ్లు ఉద్యోగాలు ఇచ్చేవారు.
  • ఆయా స్కూళ్లలో చేరిన ముఠా సభ్యులు తమకు వేం నరేందర్‌ రెడ్డితో మంచి పరిచయాలున్నాయని, కావాల్సిన చోటుకి బదిలీలు చేయిస్తామని నమ్మించేవారు. ఇలా ఇతర ఉద్యోగుల నుంచి వాళ్లు డబ్బులు వసూలు చేసేవారు. ఈవిధంగా సోషల్‌ వెల్ఫేర్‌ పాఠశాలలకు చెందిన ఏడుగురు ఉద్యోగుల నుంచి రూ.7లక్షల వసూలు చేశారు.
  • ఈ ముఠా సభ్యులే డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి కీసర, చర్లపల్లి ప్రాంతాలకు చెందిన దాదాపు వంద మందికి టోకరా వేశారు. కొందరి వద్ద అత్యధికంగా రూ.3.50 లక్షల దాకా వసూలు చేశారు. డబ్బు కట్టిన వారికి నమ్మకం కలిగించేందుకు ఈ ముఠాకు చెందిన హర్షిణి రెడ్డి తాను కీసర ఆర్డీవో అంటూ లబ్ధిదారులకు ఫోన్లు చేసి మాట్లాడేది.
  • ముఠా సూత్రధారి సురేందర్‌ రెడ్డి ఈవిధంగా సంపాదించే డబ్బును విలాసాల కోసం, బెట్టింగ్‌పై ఖర్చు పెట్టేవాడని పోలీసులు గుర్తించారు.
  Last Updated: 25 Aug 2024, 01:44 PM IST