Telugu States : తెలుగు రాష్ట్రాల్లో అంబుడ్స్‌మన్‌ లేని వర్సిటీలు ఇవే!

Telugu States : దేశంలోని యూనివర్సిటీల నిర్వహణకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) ఇచ్చే నిబంధనలే ప్రామాణికం.  

  • Written By:
  • Publish Date - March 13, 2024 / 07:57 PM IST

Telugu States : దేశంలోని యూనివర్సిటీల నిర్వహణకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) ఇచ్చే నిబంధనలే ప్రామాణికం.  విద్యార్థుల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అంబుడ్స్‌మన్‌ను నియమించాలని యూనివర్సిటీలకు యూజీసీ నిర్దేశిస్తోంది. అయితే నేటికీ చాలా విశ్వవిద్యాలయాలు అంబుడ్స్‌మన్‌‌లను  నియమించుకోలేదు. అలాంటి వర్సిటీ లిస్టును యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) బుధవారం విడుదల చేసింది. పదేపదే గుర్తు చేసినా ఆయా వర్సిటీలు అంబుడ్స్‌మెన్‌లను నియమించలేదని తెలిపింది. వాటిని ‘డీఫాల్ట్‌ యూనివర్సిటీల జాబితా’లో చేర్చామని వెల్లడించింది. ఈ లిస్టులో 159 రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు ఉండగా.. మరో 67 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, 2 డీమ్డ్‌ యూనివర్సిటీలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన 6 యూనివర్సిటీలు కూడా ఈ లిస్టులో ఉండటం గమనార్హం.

We’re now on WhatsApp. Click to Join

2023 ఏప్రిల్‌లో ఆదేశించినా.. 

అంబుడ్స్‌మన్‌లను 30రోజుల్లోగా నియమించాలంటూ ఆయా యూనివర్సిటీలను 2023 ఏప్రిల్‌లో యూజీసీ ఆదేశించింది.ఆ తర్వాత పలుమార్లు గుర్తు చేసినా ఇంకా (2024 మార్చి 12వరకు అప్‌డేట్‌ చేసిన జాబితా ఇది) నియమించని వర్సిటీల జాబితాను తాజాగా యూజీసీ కార్యదర్శి మనీశ్‌ ఆర్‌.జోషీ విడుదల చేశారు. ఈ లిస్టులో ఉన్న యూనివర్సిటీలు ఒకవేళ అంబుడ్స్‌మన్‌లను నియమించినట్లయితే పూర్తి వివరాలను సెంట్రల్‌ వర్సిటీలకు సంబంధించి mssarma.ugc@nic.in; రాష్ట్ర యూనివర్సిటీలైతే smitabidani.ugc@nic.in, డీమ్డ్‌ వర్సిటీలైతే jitendra.ugc@nic.in, ప్రైవేటు వర్సిటీలైతే shakeel.ugc@nic.inకు ఈమెయిల్‌ ద్వారా పంపొచ్చు. ఏదైనా వర్సిటీ, కళాశాల అంబుడ్స్‌మన్‌, ఫిర్యాదుల పరిష్కార కమిటీలను నియమించకపోతే సాధారణ ప్రజలు, విద్యార్థులు సైతం పైన పేర్కొన్న ఈ మెయిళ్లకు సమాచారం ఇవ్వొచ్చు.

Also Read : Anjira: కచ్చితంగా అంజూర పండ్లను తినాల్సిందే అంటున్న వైద్యులు.. ఎందుకో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో అంబుడ్స్‌మన్‌లను నియమించని వర్సిటీలు

అంబుడ్స్‌మన్‌లను నియమించని వర్సిటీల లిస్టులో  తెలుగు రాష్ట్రాల(Telugu States) నుంచి 6 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటిలో ఏపీలో మూడు, తెలంగాణ నుంచి మూడు ఉన్నాయి. ఏపీ పరిధిలో ఆంధ్రప్రదేశ్‌ ఫిషరీస్‌ యూనివర్సిటీ- విజయవాడ; క్లస్టర్‌ యూనివర్సిటీ -కర్నూలు, శ్రీ వేంకటేశ్వర వేదిక్‌ యూనివర్సిటీ- తిరుపతి ఉన్నాయి. తెలంగాణ పరిధిలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ -వరంగల్‌, నిజాం ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ -హైదరాబాద్‌, రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీ-బాసర ఉన్నాయి.

Also Read : Rakul Preet Singh: ఆ విషయంలో పెళ్లి తర్వాత కూడా తగ్గేదేలే అంటున్న రకుల్ ప్రీత్ సింగ్?