Site icon HashtagU Telugu

Telangana MLC Polls : మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో కీలక అభ్యర్థులు, ఆశావహులు వీరే

Telangana Mlc Polls Elections Mlc Elections 2025 Congress Bjp Brs

Telangana MLC Polls : మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో  తలపడేందుకు తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సిద్ధమయ్యాయి. ఈ ఎన్నికల నోటిఫికేషన్  ఫిబ్రవరి 3న విడుదల అవుతుంది. ఫిబ్రవరి 27న పోలింగ్‌ జరుగుతుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేస్తారు. తెలంగాణలోని నల్గొండ-వరంగల్‌-ఖమ్మం జిల్లాలు, మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరుగుతుంది. వీటితో పాటు మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ, విపక్షంలోని బీఆర్ఎస్, బీజేపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. బలమైన అభ్యర్థులు, పదునైన రాజకీయ వ్యూహాలతో ఎన్నికల బరిలోకి దూకేందుకు సన్నద్ధం అవుతున్నాయి.

Also Read :Sunita Williams : సునితా విలియమ్స్‌ను భూమికి తీసుకురండి.. ట్రంప్ ఆదేశం.. మస్క్‌ ప్రకటన

కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డికి తీవ్ర పోటీ

ఎలాగైనా ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలను చేజిక్కించుకోవాలని సీఎం రేవంత్(Telangana MLC Polls) భావిస్తున్నారు. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి మూడు ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్‌కు దక్కేలా చేయాలని ఆయన యోచిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తును మొదలుపెట్టింది. మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌- కరీంనగర్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా ప్రస్తుతం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి ఉన్నారు. ఆయనకే మరోసారి పోటీ చేసే అవకాశమివ్వాలని కోరుతూ కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలంగాణ పీసీసీ సిఫారసు చేసింది. ఎందుకంటే గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ  ప్రతిపక్షంలో ఉంది. అయినా జీవన్‌రెడ్డి గట్టిగా పోరాడి గెలిచారు. ఈ స్థానాన్ని ఆశిస్తున్న వారిలో  విద్యాసంస్థల అధినేత ముస్కు రమణారెడ్డి, వెలిచాల రాజేందర్, నరేందర్‌రెడ్డి , ప్రసన్న హరికృష్ణ కూడా ఉన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో తమ అభ్యర్థులకు మద్దతివ్వాలని కాంగ్రెస్‌ నేతలను వామపక్షాలు కోరుతున్నాయి. బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సంగారెడ్డి జిల్లాకు చెందిన గోదావరి అంజిరెడ్డిని ప్రకటించారు.

Also Read :Minister Seethakkka: మాజీ మంత్రి కేటీఆర్‌కు మంత్రి సీతక్క వార్నింగ్‌!

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ స్థానంలో..

ప్రస్తుతం వరంగల్‌-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా అలుగుబెల్లి నర్సిరెడ్డి ఉన్నారు. ఈయన టీఎస్‌యూటీఎఫ్‌ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. ఈ స్థానంలో పీఆర్‌టీయూటీఎస్‌ అభ్యర్థిగా పింగిలి శ్రీపాల్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి(జాక్టో) బలపరిచిన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌ బరిలో నిలిచారు. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా వరంగల్‌ జిల్లాకు చెందిన సరోత్తంరెడ్డి పోటీచేస్తున్నారు. సీపీఎస్‌ సంఘం అభ్యర్థిగా డాక్టర్‌ కొల్లిపాక వెంకటస్వామి, పీఆర్‌టీయూ తెలంగాణ నుంచి హర్షవర్ధన్‌రెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ స్థానంలో..

మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ప్రస్తుతం పీఆర్‌టీయూటీఎస్‌ నేత కూర రఘోత్తమ్‌రెడ్డి ఉన్నారు. అయితే ఈసారి పీఆర్‌టీయూటీఎస్‌ తమ అభ్యర్థిగా వంగ మహేందర్‌రెడ్డిని ప్రకటించింది. విద్యాసంస్థల అధినేత మల్క కొమరయ్యను తమ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. ఈ స్థానం పరిధిలో బీజేపీకి ముగ్గురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఇక్కడ బీజేపీ అభ్యర్థి ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు.  టీఎస్‌యూటీఎఫ్, టీపీటీఎఫ్‌ బలపరిచిన ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా వై.అశోక్‌కుమార్‌ పేరు ఖరారైంది. సీపీఎస్‌ సంఘం నుంచి ఇన్నారెడ్డి పోటీ చేస్తున్నారు. ఎస్‌టీయూటీఎస్‌ నుంచి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

పోటీకి దూరంగా బీఆర్ఎస్  ?

ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా ? వద్దా ? అనే దానిపై  బీఆర్ఎస్‌లో తర్జనభర్జన జరుగుతోందని తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్‌ను ఆశిస్తూ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. 2018లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పోటీ చేయలేదు.  స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రవీందర్ సింగ్‌కు మద్దతు ఇచ్చింది. ఇక ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు కోసం దాదాపు 25 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయనున్నారు. పార్టీ గుర్తులతో కాకుండా అభ్యర్థుల పేర్లతో పోలింగు జరుగుతుంది. అందుకే ఈ ఎన్నికల్లో ఉపాధ్యాయ సంఘాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.