CM Revanth Highlights: పెద్దపల్లి యువ వికాసం సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Highlights) గ్రూప్-4 స్థాయి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు మంత్రులతో కలిసి నియామకపత్రాలు అందజేశారు. అంతేకాకుండా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రూప్-4లో ఎంపికైన 8,084 మందికి యువ వికాసం వేదికపై నియామక పత్రాలు అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. పెద్దపల్లి రైతుల కోసం కొట్లాడితే ఆనాడు కాంగ్రెస్ నాయకులను కేసీఆర్ జైల్లో పెట్టారని సీఎం రేవంత్ గుర్తుచేశారు. ఆనాడు ఏ ప్రాజెక్టుల కోసం కొట్లాడామో.. ఆ ప్రాజెక్టులు పూర్తి చేసుకునే అవకాశం ఈరోజు వచ్చిందన్నారు.
సామాన్యుడిని సీఎంగా చేసింది మీరే: సీఎం రేవంత్
సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తాను సీఎం అవ్వడానికి కారణం రాష్ట్ర ప్రజలేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి సభలో మాట్లాడుతూ.. కరీంనగర్ గడ్డ మీదే కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ గురించి మాట ఇచ్చారని తెలిపారు. ఉద్యోగాలు, ప్రాంత అభివృద్ధి కోసమే రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని చెప్పారు. రాష్ట్ర సాధనలో విద్యార్థులే ముఖ్య భూమిక పోషించారని పేర్కొన్నారు.
కేసీఆర్‌పై సీఎం రేవంత్ సెటైర్లు
కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వకుండా రైతాంగాన్ని మోసం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. పెద్దపల్లి సభలో మాట్లాడుతూ.. రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే కేసీఆర్‌కు మాత్రం ఎకరాకు రూ.కోటి పంట పడిందని చెప్పారని విమర్శించారు. ఎకరాకు రూ.కోటి ఆదాయం రావడం ఇప్పటికీ బ్రహ్మపదార్థమేనని సెటైర్లు వేశారు. ఆ కిటుకు ఏంటో ఆయన చెప్పలేదని ఎద్దేవా చేశారు.
బీజేపీకి రేవంత్ సవాల్
తమ పాలనలో ప్రజలు తమ బాధలను చెప్పుకోగలుగుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. పెద్దపల్లిలో మాట్లాడుతూ.. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయకపోగా.. తమపై విషప్రచారం చేస్తోందన్నారు. తాము ఏడాదిలోనే తర్వాత 55,143 ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. మోదీ సీఎంగా ఉన్న సమయంలో గుజరాత్‌లో ఇన్ని ఉద్యోగాలు ఏ ఏడాదిలోనైనా ఇచ్చారా అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. దీనిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.
Also Read: Yuva Vikasam Meeting : పెళ్లి అయిన వెంటనే పిల్లలు పుడతారా? : బిఆర్ఎస్ పై సీఎం రేవంత్ సెటైర్
నియామకపత్రాలు ఎందుకు ఇవ్వలేదు: సీఎం
పేదవాడికి ఉద్యోగం, ఉపాధి దొరికితే అతని భవిష్యత్తు తరాలు బాగుపడతాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పెద్దపల్లిలో మాట్లాడుతూ.. అయినా పరీక్షలు జరగకుండా కొందరు దొంగ నిరసనలు చేయించారని ఆరోపించారు. తామే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చామని బీఆర్‌ఎస్ నేతలు అంటున్నారని చెప్పారు. ఎంపీగా ఓడిపోయిన కవిత మూడు నెలల్లోనే ఎమ్మెల్సీ అయ్యారని, అలాంటిది నోటిషికేషన్లు ఇచ్చినవారు పదేళ్లుగా నియామకపత్రాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
56 వేల ఉద్యోగాలు ఇచ్చాం: డిప్యూటీ సీఎం భట్టి
ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసమని, గత బీఆర్ఎస్ పాలనలో ఎవరికీ ఉద్యోగాలు రాలేదని విమర్శించారు డిప్యూటీ సీఎం భట్టి. పెద్దపల్లి సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 11 నెలల్లోనే 56 వేల ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. యువతకు ఉపాధి పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చినట్లు వివరించారు. సింగరేణి కార్మికులకు రూ.1 కోటీ ప్రమాద బీమా చేశామని పేర్కొన్నారు.
రూ.వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి: మంత్రి ఉత్తమ్
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రాష్ట్రానికి రూ.వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు పెరిగాయని చెప్పారు. పెద్దపల్లి ప్రజా విజయోత్సవాల్లో మాట్లాడుతూ.. యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. సన్నాలు వేసిన రైతులకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు.