. రోడ్డు ప్రమాదాలపై సీఎం ఆందోళన
. ఆటోమేటిక్ చలాన్ వసూలు విధానం అవసరం
. ట్రాఫిక్ నియంత్రణలో సమన్వయం కీలకం
Revanth Reddy: వాహనాలకు చలాన్లు విధించిన తర్వాత డిస్కౌంట్ ఇస్తారనే భావన సమాజంలో పెరుగుతుండటంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానం వల్ల ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై భయం తగ్గి ఉల్లంఘనలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. ఇకపై ట్రాఫిక్ చలాన్లకు ఎలాంటి రాయితీలు ఇవ్వకూడదని స్పష్టం చేస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తే తప్పనిసరిగా శిక్ష అనుభవించాల్సిందేనని హెచ్చరించారు. వాహనదారులు బాధ్యతగా ప్రవర్తించకపోతే కఠిన చర్యలు తప్పవని ఆయన తేల్చి చెప్పారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించాలనే ఉద్దేశంతో యూసఫ్‌గూడ స్టేడియంలో నిర్వహించిన ‘అర్కైవ్ అలైవ్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గణాంకాలను ప్రస్తావిస్తూ ప్రతి నిమిషానికి ఒక ప్రమాదం చోటుచేసుకుంటోందని ప్రతి మూడు నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు.
ఇది చాలా ఆందోళనకరమైన పరిస్థితి అని సమాజమంతా దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వడం మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. చిన్న వయసులోనే వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారని ఇది కుటుంబాలకు తీరని లోటుగా మారుతోందని అన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలని నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు. చలాన్ విధించిన వెంటనే వాహన యజమాని బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు ఆటోమేటిక్‌గా కట్ అయ్యే విధానాన్ని తీసుకురావాలని సూచించారు. ఇందుకోసం వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలోనే యజమాని బ్యాంకు ఖాతాను లింక్ చేయాలని స్పష్టం చేశారు.
ఈ అంశంపై బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. అలాగే మైనర్లు ప్రమాదాలకు గురైతే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. చట్టాన్ని భయపడే వాతావరణం ఏర్పడితేనే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. రోడ్డు ప్రమాదాల నివారణలో రవాణా శాఖ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. చాలా సందర్భాల్లో మన తప్పు లేకపోయినా ఎదుటివారి నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. హైడ్రా, ఈగల్, సైబర్ క్రైమ్ విభాగాలను బలోపేతం చేసినట్లే ట్రాఫిక్ నియంత్రణలోనూ పోలీస్ వ్యవస్థను మరింత సమర్థంగా తీర్చిదిద్దాలని అభిప్రాయపడ్డారు. ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తేనే రోడ్డు భద్రత సాధ్యమవుతుందని ప్రజల ప్రాణాల రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
