CM Revanth Reddy congratulates Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. టీ. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మహేశ్‌కుమార్ గౌడ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి అభినందలు తెలిపారు. ఈ సందర్బంగా గాంధీభవన్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధిష్ఠానం ఎంతో నమ్మకంతో మహేశ్‌కుమార్‌కు కీలక బాధ్యతలు అప్పగించిందన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా తాను 38 నెలలపాటు ప్రజల తరఫున పోరాడినట్లు చెప్పారు.
Read Also: Shocking Surprise in Devara : ఎన్టీఆర్ చెప్పిన సర్ప్రైజ్ ఫై అంచనాలు..
రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని వరంగల్ డిక్లరేషన్‌లో రాహుల్ గాంధీ ప్రకటించారు. కాంగ్రెస్ మాట ఇస్తే.. తప్పక జరిగితీరుతుందని నిరూపించాం. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో రూ.2లక్షల రుణమాఫీ చేసి చూపించాం. ఆర్టీసీలో ఇప్పటివరకు 85 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణాలు చేశారు. మోడీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర పెంచి మహిళలకు భారంగా మార్చింది. మేం రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. వ్యవసాయ రుణం రూ.2లక్షలకు పైగా ఉన్న రైతులు భయపడొద్దు. రూ.2లక్షలకుపైగా ఉన్న మొత్తాన్ని రైతులు బ్యాంకుల్లో చెల్లిస్తే రూ.2లక్షల రుణమాఫీ పూర్తవుతుంది.
కేసీఆర్ కుటుంబంలో ఉద్యోగాలు పోతేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పాం. ఇప్పటికే 30వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం. ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ ఇచ్చి విద్యార్థులకు ఎంతో మేలు చేశాం. ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.10లక్షలకు పెంచాం. ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణంతో హైదరాబాద్ గమనమే మారిపోయింది. కొత్తగా నిర్మించే రీజినల్ రింగ్‌రోడ్డుతో తెలంగాణ స్వరూపమే మారుతుంది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు, విజయాలు సెమీఫైనల్స్ మాత్రమే.. రాహుల్ గాంధీని ప్రధానిని చేసినప్పుడే మనం ఫైనల్స్‌లో గెలిచినట్లు. 2029 ఫైనల్స్‌లో మనం ఘన విజయం సాధించాలి. 1994 నుంచి రాష్ట్రంలో ప్రతిపార్టీ రెండు సార్లు గెలిచింది. కాంగ్రెస్ కూడా కచ్చితంగా వరుసగా రెండు సార్లు అధికారంలోకి వస్తుంది.. అన్నారు.
ఈ సదర్భంగా ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డిల వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కార్యకర్తలు ఎవరి జోలికి వెళ్లబోరని తెలిపారు. కానీ, ఎవరైనా తమ జోలికి వస్తే మాత్రం ఉపేక్షించేది లేదు అని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తలకు నేను అండగా ఉంటా. మహేశ్ కుమార్ గౌడ్ సౌమ్యుడు.. ఏం కాదు అనుకుంటున్నారేమో. ఆయన వెనుక నేనుంటా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘అసలు రా చూసుకుందాం’ అని ముందు కౌశిక్ రెడ్డి ఎందుకు అనాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ప్రజలు విశ్వసించి కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని అన్నారు. తాము రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తామని మాట్లాడిన వారు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారని అడిగారు.రాజీనామా చేస్తే సిద్దిపేటకు పట్టిన పీడ విరగడయ్యేదని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలను అమలు చేశామని అన్నారు.