Hyderabad Vijayawada Highway హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65) పై ప్రయాణం ఇప్పుడు నరకప్రాయంగా మారింది. హయత్‌నగర్, భాగ్యలత, పంత్ కాలనీ ప్రాంతాల్లో జరుగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా రహదారి ఇరుకుగా మారి.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతోంది. భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు కదలలేక గంటల తరబడి నిలిచిపోవడంతో ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అత్యవసర స్థితిలో ఉన్న అంబులెన్సులు కూడా ఈ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు వాహనాలను దారి మళ్లిస్తున్నప్పటికీ రద్దీ తగ్గడం లేదు.
హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్లే జాతీయ రహదారి (NH-65) ఇప్పుడు ప్రయాణికుల సహనానికి పరీక్షగా మారింది. నగర శివార్లలో జరుగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులు, రోడ్డు విస్తరణ పనుల వల్ల ఈ మార్గంలో ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ముఖ్యంగా హయత్ నగర్ సమీపంలని భాగ్యలత, పంత్ కాలనీ దగ్గర వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. హయత్‌నగర్ పరిసర ప్రాంతాల్లో ఫ్లైఓవర్ పిల్లర్ల నిర్మాణం కోసం రహదారి మధ్యలో భారీగా తవ్వకాలు చేపట్టారు. దీనివల్ల ప్రయాణానికి అందుబాటులో ఉన్న రోడ్డు చాలా ఇరుకుగా మారింది. సాధారణ రోజుల్లోనే రద్దీగా ఉండే ఈ హైవేపై, ఇప్పుడు రోడ్డు కుంచించుకుపోవడంతో భారీ కంటైనర్లు, ఆర్టీసీ బస్సులు మలుపులు తిరగడానికి ఇబ్బంది పడుతున్నాయి. ఒక్క వాహనం ఆగినా దాని వెనుక కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతోంది.
ప్రతిరోజూ ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, స్కూలు పిల్లలు ఈ ట్రాఫిక్ కారణంగా సమయానికి చేరుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం సమయాల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. అత్యవసర వైద్యం కోసం వెళ్లే అంబులెన్సులు కూడా ఈ ట్రాఫిక్ లో చిక్కుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. నిర్మాణ పనుల వల్ల రోడ్డుపై భారీగా దుమ్ము పేరుకుపోతోంది.. దీనివల్ల ద్విచక్ర వాహనదారులు శ్వాసకోశ ఇబ్బందులతో పాటు ప్రమాదాలకు గురవుతున్నారు.
ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి వాహనాలను క్రమబద్ధీకరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వాహనాలను సర్వీస్ రోడ్ల ద్వారా లేదా ఇతర ఇన్నర్ రింగ్ రోడ్ల వైపు మళ్లిస్తున్నారు. అయితే.. భారీ వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఈ మళ్లింపులు కూడా పెద్దగా ప్రభావం చూపడం లేదు. వాహనదారులు హయత్‌నగర్ జంక్షన్ దాటాలంటే కనీసం 30 నుండి 45 నిమిషాల సమయం అదనంగా పడుతోంది.
రహదారి పనులు త్వరగా పూర్తి చేసి… ప్రయాణికులకు ఈ నరకం నుంచి విముక్తి కలిగించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ పనులు పూర్తయితే భవిష్యత్తులో ప్రయాణం సాఫీగా సాగుతుందని అధికారులు చెబుతున్నప్పటికీ.. ప్రస్తుతం ఉన్న ఇబ్బందులను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.
