BRS Silver Jubilee : పదేళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా తెలంగాణలో పాలన సాగించిన బీఆర్ఎస్ పార్టీ గడ్డుకాలాన్ని చూస్తోంది. ఇప్పుడు ఆ పార్టీకి లోక్‌సభలో ఒక్క ఎంపీ కూడా లేడు. శాసనసభలోనూ పెద్దగా బలం లేదు. ఉన్న ఎమ్మెల్యేలలో 10 మంది కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్‌లో పునరుత్తేజం తెచ్చేందుకు కేసీఆర్ కసరత్తు మొదలుపెట్టారు. 2001 ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భవించింది. పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారీ బహిరంగ సభను ప్లాన్ చేస్తున్నారు.
Also Read :Army Chief Vs Army : పాక్ ఆర్మీ చీఫ్‌పై తిరుగుబాటు ? ఇమ్రాన్ ఖాన్‌కు మంచి రోజులు !
కేసీఆర్ స్వయంగా..
వరంగల్ నగర శివారులోని దేవన్నపేట, భట్టుపల్లి ప్రాంతాలలో సభను నిర్వహించాలని తొలుత భావించారు. అయితే అక్కడ సౌకర్యవంతంగా ఉండదని తేలింది. అనంతరం ఘట్ కేసర్ పేరును కేసీఆర్(BRS Silver Jubilee) ప్రస్తావించారు. అక్కడి ఎమ్మెల్యే మల్లారెడ్డికి సమాచారాన్ని అందించి, సభ నిర్వహణకు అనువైన స్థలాన్ని పరిశీలించాలని సూచించారు. దీంతో ఘట్ కేసర్ ఫిక్స్ అయినట్టే అని అందరూ అనుకున్నారు. ఈ తరుణంలో కేసీఆర్‌కు సన్నిహితుడైన హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ బాబు విజ్ఞప్తి మేరకు సభా స్థలాన్ని హనుమకొండ జిల్లా ఎల్కతుర్తికి మార్చారు.
అక్కడే ఎందుకంటే..
ఎల్కతుర్తి మండల కేంద్రంలో 10 లక్షల మందితో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల జంక్షన్‌గా ఉండటంతో పాటు జన సమీకరణకు, వాహనాల రాకపోకలకు జాతీయ రహదారి 563, జాతీయ రహదారి 765డీజీ రోడ్లతో అనువుగా ఉంటుందన్న ఉద్దేశంతో దాదాపుగా ఎల్కతుర్తిని ఖరారు చేసినట్లు తెలిసింది.సర్వేయర్లతో డ్రోన్ల ద్వారా ప్రతిపాదిత సభా స్థలాన్ని చిత్రీకరించి మ్యాపింగ్ చేయించారు. సభ నిర్వహణకు స్థలం ఇచ్చేందుకు అక్కడ భూములున్న వారి నుంచి అంగీకార పత్రాలు సేకరిస్తున్నారు. మొత్తం మీద ఆవిర్భావ దినోత్సవ సభపై బీఆర్ఎస్ అధినాయకత్వం గంపెడు ఆశలు పెట్టుకుంది. ఈ సభ ద్వారా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ క్యాడర్‌ను సన్నద్ధం చేయొచ్చని వారు భావిస్తున్నారు.