Tiger Fear : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు గ్రామాల ప్రజలకు పెద్దపులి దడ పుట్టించింది. శుక్రవారం రోజు పసుపుల, ఘట్టిగూడెం గ్రామాల పరిధిలోని అడవుల్లో పెద్దపులి అరుపులను విన్నామని గ్రామస్తులు తెలిపారు. పెంబితండా శివార్లలోనూ పెద్దపులిని చూశామని కొందరు రైతులు చెప్పారు. దీంతో ఏం జరుగుతుందో అని ఆయా గ్రామాల ప్రజలు హడలిపోయారు. అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని గత (శుక్రవారం) రాత్రిని గడిపారు. ఈ తరుణంలో అటవీ అధికారులు ఒక కీలక విషయాన్ని వెల్లడించారు. ఆయా గ్రామాల ప్రజలకు కనిపించిన పులి.. కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలోకి వెళ్లిపోయిందని ప్రకటించారు. ఆ పులి పాదముద్రల ఆధారంగా ఈవిషయాన్ని అటవీ అధికారులు నిర్ధారించారు. దీంతో పసుపుల, ఘట్టిగూడెం, పెంబితండా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read :North Korea : దక్షిణ కొరియాపైకి ఉత్తర కొరియా ‘సౌండ్ బాంబ్’.. ఏమైందంటే ?
పసుపుల, ఘట్టిగూడెం, పెంబితండా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన పెద్దపులే.. నిర్మల్ జిల్లా కుంటాల, హన్మాన్‌నగర్ తండా ప్రాంతాల్లోనూ సంచరించిందని అటవీ అధికారులకు సమాచారం అందింది. తొలుత మహారాష్ట్ర సరిహద్దు సమీపంలోని అప్పారావుపేట్ బీట్ పరిధిలోకి.. అక్కడి నుంచి కుంటాల, హన్మాన్‌నగర్ తండా ప్రాంతాల వైపు పులి మళ్లిందని గుర్తించారు. కుంటాలలో మార్నింగ్ వాక్‌కు వెళ్లిన ఓ వ్యక్తికి పెద్దపులి కనిపించిందని సమాచారం. ఇక నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్‌లో మరో పెద్దపులి(Tiger Fear) కనిపించిందని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ పులులు కనిపించడంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. ఆ పులులు .. ఏ రాత్రి తమ పల్లెలలోకి ప్రవేశిస్తాయో తెలియక టెన్షన్‌తో కాలం వెళ్లదీస్తున్నారు. అటవీ అధికారులు ప్రభావిత పల్లెల్లో సీసీటీవీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసిన పులుల కదలికలను ట్రాక్ చేయాలి. ఆ సమాచారం ద్వారా సంబంధిత గ్రామాల ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించాలి.