Telangana State Bird: పాలపిట్ట.. తెలంగాణ రాష్ట్ర పక్షి. ఏపీ, కర్ణాటక, ఒడిశా, బిహార్ రాష్ట్రాల్లోనూ ఇది రాష్ట్ర పక్షి. అంతరించిపోతున్న పక్షుల జాబితాలో పాలపిట్ట చేరింది. ‘స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్ రిపోర్ట్’లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. 2023తో పోలిస్తే 2024 సంవత్సరంలో మన దేశంలోని పాలపిట్టల సంఖ్య 30 శాతం తగ్గిపోయిందని ఆ నివేదిక వెల్లడించింది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) నివేదికలో కూడా ‘రెడ్ లిస్ట్’ రీఅసెస్‌మెంట్ కోసం పాలపిట్టను సిఫార్సు చేశారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. పాలపిట్ట అంతరించిపోకుండా కాపాడేందుకు నడుం బిగించింది. పాలపిట్ట ఉనికికి పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం(Telangana State Bird), దాన్ని రక్షించే చర్యలను మొదలుపెట్టింది. ఇందుకోసం చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోనుంది. పాలపిట్ట సంరక్షణకు అటవీ శాఖ ప్రణాళిక సిద్ధం చేయనుంది.
Also Read :MLA Quota MLCs: మజ్లిస్, సీపీఐకు చెరొకటి.. 2 ఎమ్మెల్సీ సీట్లలో కాంగ్రెస్ లెక్కలివీ
చట్టం ఏం చెబుతోంది ?
రంగురంగుల పాలపిట్టను దర్శించిన తర్వాతే దసరా పండుగ పూర్తవుతుంది. ఏటా దసరా, ఉగాది పండుగల టైంలో.. పాలపిట్టలను కొందరు బంధించి పట్టణాల్లో ప్రదర్శించి డబ్బులను వసూలు చేస్తున్నారు. ఈ తరహా అంశాలు వాటికి ప్రాణసంకటంగా మారుతున్నాయి. అటవీచట్టం షెడ్యూల్–4లో పాలపిట్ట ఉంది. అందువల్ల దాన్ని దాన్ని బంధించడం, హింసించడం వంటివి చేస్తే నాన్‌బెయిలబుల్ కేసులు నమోదవుతాయి. మూడేళ్ల జైలుశిక్ష, రూ.25 వేల వరకు జరిమానా విధిస్తారు.
Also Read :Earthquake : మనదేశంలో మరో భూకంపం.. రోడ్లపైకి జనం పరుగులు
తెలంగాణలో పాలపిట్టలు ఎందుకు తగ్గిపోతున్నాయి ?
పాలపిట్టల సంఖ్య తగ్గిపోవటానికి ప్రధాన కారణాలు గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం, మొబైల్ టవర్ల రేడియేషన్. హైదరాబాద్ నగరం, దాని పరిసర జిల్లాల్లో రియల్ ఎస్టేట్ బాగా విస్తరించింది. దీంతో ఆయాచోట్ల వ్యవసాయ సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో పాలపిట్టలు వాటి ఆవాస ప్రాంతాలను కోల్పోయాయి. పంట పొలాలు, తోటలు, ఉద్యా నవనాల్లోని తెగుళ్లను తిని పాలపిట్టలు కడుపు నింపుకుంటాయి. పంటలను నష్టపరిచే కీటకాలు, సరీసృపాలు, ఉభయ చరాలను తింటాయి. దీనివల్ల రైతులకు పరోక్షంగా లాభం చేకూరుతుంది. అందుకే వీటిని రైతునేస్తాలు అంటారు. పంటల రక్షణ కోసం అధిక మోతాదులో పురుగుమందులు వాడుతున్నారు. ఈ ప్రభావం పాలపిట్టల ఆరోగ్యంపై పడుతోంది. దీంతో వాటి ఆయుర్దాయం తగ్గిపోతోంది. పాలపిట్ట సగటు జీవితకాలం 17 ఏళ్ల నుంచి 20 ఏళ్లు. పాలపిట్టను ఇండియన్ రోలర్, బ్లూ జే అని కూడా పిలుస్తారు. ఇవి చెట్ల తొర్రల్లో గూళ్లు పెట్టి మూడు నుంచి ఐదు గుడ్లు పెడతాయి. వీటి ప్రత్యుత్పత్తి టైం ఏటా ఫిబ్రవరి–జూన్ నెలలు.