ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ రాబోయే రోజులకు సంబంధించి కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ రాష్ట్రంలోని 6 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. మిగిలిన 27 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు ప్రకటించారు. ఈ వారంలో చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 నుంచి 1.5 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు.
ఉత్తర భారతదేశం నుంచి తెలంగాణ వైపు పొడి, వేడి గాలులు వీస్తుండటమే ఈ తీవ్రతకు ప్రధాన కారణమని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. గాలిలో తేమ శాతం తక్కువగా ఉండటంతో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయని తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం పూట అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు.
శరీరం డీహైడ్రేట్ కాకుండా నీరు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, అనారోగ్యంతో బాధపడేవారు వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున, వారు మరింత జాగ్రత్తగా చల్లని ప్రదేశాల్లో ఉండాలని సూచించారు.
