Site icon HashtagU Telugu

Telangana Congress : కాంగ్రెస్ తో వామపక్షాల పొత్తు కు రంగం సిద్ధం

Telangana Congress

The Stage Is Set For The Alliance Of The Left Parties With The Congress

‌‌By: డా. ప్రసాదమూర్తి

Telangana Congress set the Left Parties : తెలంగాణ ఎన్నికలు శరవేగంతో దూసుకు వస్తున్నాయి. పార్టీలు అప్పుడే అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డాయి. ఇందులో బిఆర్ఎస్ అందరికంటే ముందు తన అభ్యర్థులను ప్రకటించి, ముందు స్థానంలో నిలిచింది. అయితే తమకు కెసిఆర్ నుంచి సకాలంలో పిలుపు వస్తుందని, రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ తో కలిసి తాము పోటీ చేయబోతున్నామని, తమకు సముచిత రీతిలో సీట్ల కేటాయింపు జరుగుతుందని వామ పక్షాలు అత్యంత ఆశగా చివరి నిమిషం వరకూ ఎదురుచూశాయి. వారి ఆశలు అత్యాశలే అయ్యా యి. ఒక్క సీటు కూడా ఇవ్వడానికి వామపక్షాలు తెలంగాణలో అర్హత కోల్పోయాయని, బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఇటీవల తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించి తేల్చిపారేశారు.

దీంతో బిఆర్ఎస్ తో వామపక్షాల ఎన్నికల ప్రయాణం అసాధ్యమని నూటొక్క శాతం జనానికి అర్థం అయిపోయింది. సరే ఇక వామపక్షాల దగ్గర మిగిలిన ప్రత్యామ్నాయం మరొకటి ఏముంది, కాంగ్రెస్ తప్ప? వామపక్షాలకు తెలంగాణ (Telangana)లో ఇక మరో దిక్కులేదు. అందుకే ఇప్పుడు వామ పక్షాలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడెప్పుడు తమను పిలుస్తుందా అని ఆత్రంగా ఎదురుచూపులు విసురుతూ నిలుచున్నాయి.
ఈ నేపథ్యంలో సిపిఐ నేతలతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆదివారం నాడు సమావేశం కావడం ప్రాముఖ్యత సంతరించుకుంది. కాంగ్రెస్ వారితో జరిగిన ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యవర్గం సభ్యులు చాలా వెంకటరెడ్డి, చల్లా వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల పొత్తు ప్రతిపాదనలపై వారు తమ సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఇది అందరూ ఊహించిన పరిణామమే. అసలు బిఆర్ఎస్ కంటే ముందే, దేశవ్యాప్తంగా బిజెపికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్న కాలంలో, తెలంగాణ (Telangana)లో కూడా తాము కాంగ్రెస్ తోనే ఎన్నికల బరిలో దిగుతామని వామపక్షాలు ప్రకటించి ఉంటే, వారికి ఓట్లూ సీట్ల మాటేమో గానీ పరువు బాగా దక్కేది. కానీ వారు అలా చేయలేదు. కేసీఆర్ కడగంటి చూపు కటాక్షం కోసం ఆఖరి నిమిషం దాకా ఎదురు తెన్నులు చూసారు. కేసీఆర్ పూచిక పుల్ల కంటే హీనంగా వామపక్షాలను విదిల్చి వేసిన విషాదం కడుపార అనుభవించాక మాత్రమే వామపక్షాలు కాంగ్రెస్ వైపు చూపు సారించాయి. సరే, ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ తోనైనా సీట్ల సర్దుబాటు విషయంలో పంతాలకు పట్టింపులకు పోకుండా తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రధాన ప్రత్యర్థులైన బిఆర్ఎస్ ను, బిజెపిని ఎదుర్కోవడంలో వామపక్షాలు తమ వంతు సహాయాన్ని అందిస్తే, ఒక చారిత్రక పరిణామంలో వారు చారిత్రక పాత్ర నిర్వహించిన వారిగా చరిత్రలో మిగిలిపోతారు.

ఆదివారం జరిగిన సమావేశ సమాచారం చూస్తే, సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక నిర్దిష్ట ప్రణాళికతో రావాలని సిపిఐ నేతలు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ తో తమ పొత్తు, సిపిఎం రాష్ట్ర నాయకత్వాన్ని సంప్రదించాకే చివరి రూపు తీసుకుంటుందని సిపిఐ నేతలు స్పష్టం చేసినట్లు కూడా తెలిసింది.

నేపథ్యం అందరికీ తెలుసు. జరుగుతున్న పరిణామాలు తెలుసు. రానున్న ఎన్నికలలో ప్రధాన పోటీ ఎవరి మధ్యనో కూడా తెలుసు. కనుక వామపక్షాలు అనివార్యంగా కాంగ్రెస్ తో కలిసి ఎన్నికల బరిలో దిగడానికి ఎలాంటి అవకాశం దొరికినా వదులుకోవనే అనిపిస్తుంది. చూడాలి. చారిత్రక తప్పిదాలు చేయడం అలవాటైనవారికి గుణపాఠాలు కూడా తీసుకోవడం అవసరమే కదా.

Also Read:  Uttar Pradesh : విద్వేషం విద్యాలయాల్లోకి ప్రవేశించిందా?