Site icon HashtagU Telugu

BRS: ‘ఆడపులి’ గర్జన ! బిఆర్ఎస్ తర్జన భర్జన !!

Brs Mlc Kalvakuntla Kavitha

Brs Mlc Kalvakuntla Kavitha

”భౌగోళిక తెలంగాణ సాధించినప్పటికీ,సామాజిక తెలంగాణ సాధించలేకపోయాం” అని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మేడే సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.”రైతుబంధు అమలవుతున్న తీరు సరిగ్గా లేదు.ఎకరం ఉన్న వ్యక్తికి 10 వేల రూపాయలు,10 ఎకరాలున్నవారికి లక్ష రూపాయలు ఇస్తున్నాం. తలసరి ఆదాయంలో అసమానతలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో అసమానతలు తొలగిపోవటానికి, సమసమాజ నిర్మాణం దిశగా మరొక తెలంగాణ ఉద్యమం చేయాల్సి ఉంది”. అని కూడా ఆమె అన్నారు. కవిత వ్యాఖ్యలపై బిఆర్ఎస్ హైకమాండ్ స్పందించవలసి ఉన్నది. ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీని ఇరుకున పెడుతున్నాయి. కనుక కవిత కామెంట్స్ పై పార్టీ విధానాన్ని స్పష్టం చేయవలసి ఉన్నది. పార్టీ విధానం తెలియనంతవరకు కవిత వ్యాఖ్యల ప్రకంపనలు కొనసాగుతూ ఉంటాయి.

”ఎవరైనా గొప్ప వ్యక్తి అడుగుజాడల్లో నడవకండి. అది ప్రమాదం. అతన్ని అధిగమించాలంటే మీరు రెండింతలు విజయం సాధించాలి. అనుసరించేవారిని, అనుకరించేవారని అంటారు. ఎంత చెమటోడ్చినా ఆ భారాన్ని వదిలించుకోలేరు. గొప్ప పేరు సంపాదించాలంటే కొత్త పంథాను ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకు నైపుణ్యం కావాలి. మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు,ప్రాధాన్యం లభించాలంటే చాలా మార్గాలున్నాయి. కొత్త దారులు ప్రయాణానికి అనువుగా ఉండకపోవచ్చు. చాలా కష్టపడాలి. కానీ తప్పదు” అని బాలస్తర్ గ్రేషియన్ ( 1601 – 1658 ) అనే తత్వవేత్త చెప్పాడు.

ఎమ్మెల్సీ కవిత బహుశా ఆ తత్వవేత్త మాటల్ని అనుసరిస్తున్నారేమో తెలియదు.కానీ కవిత లేవనెత్తిన ‘సామాజిక తెలంగాణ’,’ఆర్ధిక అసమానతలు’ అనే అంశాలు తెలంగాణ రాజకీయాల్లో,మరీ ముఖ్యంగా బిఆర్ఎస్ లో ప్రకంపనలు సృస్టిస్తున్నాయి.ఒక రకంగా ఆమె ‘భూకంపమే’ పుట్టించినట్టుగా ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్నది.కవిత లక్ష్యమేమిటో ఇంకా బహిరంగం కాకపోవచ్చు గానీ ఆమె బిఆర్ఎస్ రాజకీయా కార్యకలాపాల్లో ‘ప్రత్యేక పాయ’ గా ప్రవహించాలని అనుకుంటున్నట్టు విశ్లేషణలు వస్తున్నాయి.

బిఆర్ఎస్ లో ‘కుదిరితే అత్యవసరంగా ముఖ్యమంత్రి’ పదవి చేపట్టాలని 2014 నుంచి అనుకుంటున్న కేటీఆర్ రేసులో ముందు వరుసలో ఉన్నారు.ఆ పోటీలో హరీశ్ రావు గట్టిగా తలపడే ఛాన్సు ఉన్నది.నిన్న మొన్నటివరకు కవిత ఇంకా ఆ రేసులో ఉన్నట్లుగా సమాచారమేదీ లేదు.కానీ మే డే కార్మికదినోత్సవం వేళ ఆమె సంధించిన ప్రశ్నలు,లేవనెత్తిన అంశాలు కేసీఆర్ ను,నాటి పదేండ్ల ప్రభుత్వాన్ని డిఫెన్సులో పడేశాయి.రైతుబంధు పథకం అమలులోని లోపాలను ఆమె ఎత్తి చూపారు.తలసరి ఆదాయం గురించి కేటీఆర్,హరీశ్ వంటి వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని తోసిపుచ్చుతూ తెలంగాణ అంతటా ఒకే విధమైన ‘తలసరి ఆదాయం’ పెరుగుదల లేదని కవిత విమర్శలు గుప్పించారు.’సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయాం’ అనే మాట సూటిగా నాటి ప్రభుత్వానికి,కేసీఆర్ కు తగులుతున్నది.పైగా తండ్రి,సోదరుడు,మేన బావ కామెంట్స్ కు భిన్నంగా ఆమె ‘కొత్త ఎజండా’ ను తెరపైకి తీసుకురావడం ఎర్రవల్లి ఫార్మ్ హౌజ్ లో జరుగుతున్న ‘అంతఃపుర యుద్ధం’ వేరే డైరెక్షన్ ను తీసుకుంటోంది.ఆ పార్టీలో ఆధిపత్యపోరాటాల గురించి చాలాసార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.ఆయన వ్యాఖ్యలను కవిత వైఖరి రుజువు చేస్తోంది.

అయితే కవితపై కేసీఆర్ కుటుంబంలో ‘కొందరు’ కేసీఆర్ కు రజతోత్సవసభకు ముందే ఫిర్యాదు చేసినట్లు ఫార్మ్ హౌజ్ వర్గాలు చెబుతున్నవి.” ఆమె పని ఆమెను చేసుకోనివ్వండి.ఆమె కార్యకలాపాలకు అడ్డు తగలకండి” అని కేసీఆర్ జవాబిచ్చారని తెలుస్తోంది.కనుక కేసీఆర్ సూచనల మేరకే కవిత ఈ ‘లైను’ తీసుకొని ఉండవచ్చు.కేటీఆర్,హరీశ్ మధ్య జరుగుతున్న పోరాటానికి,కవితకు ప్రాధాన్యం ఇవ్వడమే పరిష్కారమని పార్టీ అధినేత భావిస్తున్నారేమో తెలియదు.

2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కాంగ్రెస్ సాధించిన విజయం తర్వాత ఒక దశలో టిఆర్ఎస్ అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన హఠాన్మరణం తర్వాత రాజకీయ సమతుల్యతలో నాటకీయ మార్పులు కనిపించాయి.ఆయన నిష్క్రమణతో కాంగ్రెస్ కు నాయకత్వ శూన్యత ఏర్పడింది.ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కు ఈ పరిస్థితులు అనుకూలంగా మారాయి. బలహీనమైన కాంగ్రెస్‌తో పాటు కుల ఆధారిత రాజకీయ పార్టీ అయిన టీడీపీ వల్ల, టీఆర్ఎస్‌కు బలమైన రాజకీయ శక్తిగా ఎదగడం సులభం అయింది.టీడీపీ పునాదులు కమ్మ సామాజిక వర్గంతో ముడిపడి ఉండటం వల్ల ఆ పార్టీని ఆంధ్రా బ్రాండ్‌గా నమ్మించడం తేలికైంది.ఈ పరిస్థితులన్నీ 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయానికి దోహదపడ్డాయి.కొత్త రాష్ట్రంలో తక్కువ ఉనికిని కలిగి ఉన్న ‘వెలమ భూస్వామ్య రైతు కులాని’కి అధికారం దక్కింది.ఈ ప్రాంతం గతంలో భూస్వాములుగా పరిగణించబడే ‘రెడ్డి సామాజిక వర్గం’ ఆధిపత్యం ఉండేది.కేసీఆర్ చాకచక్యంగా టీడీపీ,కాంగ్రెస్‌ల నుంచి ఓబీసీలు,ఎస్సీ,ఎస్టీలను దూరం చేసి వారి మద్దతును కూడగట్టుకోవడానికి ప్రయత్నించారు.వైఎస్ తర్వాత ఆ ఖాళీని రేవంత్ రెడ్డి భర్తీ చేశారు.ఆయన అందించిన నాయకత్వ ప్రతిభతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం లభించింది.రేవంత్ వ్యూహాలకు బిఆర్ఎస్ తరచూ ఇరకాటంలో పడుతోంది.

”తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నక్సలైట్లు పేదలకు ఆహారం,నిరాశ్రయులకు ఇల్లు,బలహీన వర్గాలకు భూమి అందించడానికి నక్సలైట్ల ఎజెండాను ఆమోదిస్తా.టిఆర్‌ఎస్‌ఎల్‌పి ఫ్లోర్ లీడర్ ఈటల రాజేందర్ సహా పిడిఎస్‌యు,జనశక్తి వంటి సంస్థల నుండి వచ్చిన అనేక మంది సభ్యులు టిఆర్‌ఎస్‌లో ఉన్నారు.తెలంగాణ,నక్సలైట్లు కలిసి ఉన్నారని ఇప్పటికే రుజువైంది.తెలంగాణకు దళితుడిని ముఖ్యమంత్రిగా చేయడం,ముస్లింను ఉప ముఖ్యమంత్రిగా చేయడం,ప్రతి పేద కుటుంబానికి 3 ఎకరాల భూమి పంపిణీ,కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య వంటి ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను తెలంగాణలో అమలు చేస్తాం”.అని కేసీఆర్ 2012 మేలో మాజీ నక్సలైట్ సాంబశివుడు టిఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా అన్నారు.’ఏ ఎండకా గొడుగు పట్టడం’లో కేసీఆర్ సిద్ధహస్తుడు.

2014 లోగా తెలంగాణ అవతరణకు పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందవచ్చునని ఆయనకు అప్పటికే ఢిల్లీ నుంచి సమాచారం ఉంది.అప్పట్లో కేంద్ర హోమ్ శాఖలో సెక్రెటరీగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి రాజీవ్ శర్మ,కాంగ్రెస్ అగ్రనాయకులు దిగ్విజయ సింగ్,జై రామ్ రమేశ్,బీజేపీ నాయకుడు విద్యాసాగరరావు తదితరులెవరో కేసీఆర్ ‘తెలంగాణ బిల్లు’ పై ఉప్పందించినట్టు ఆ సమయంలో ఒక ప్రచారం జరిగింది.అందువల్ల 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పరోక్షంగా మావోయిస్టుల మద్దతు కూడగట్టేందుకు కేసీఆర్ ప్రయత్నించారు.ఆయన ప్లాన్ కూడా సక్సెస్ అయిందనే అనుకోవాలి.అధికారంలోకి వచ్చిన తర్వాత ‘ సంక్షేమం’ పేరిట జనానికి డబ్బు పంచితే సరిపోతుందని ఆయన అనుకున్నారు.”ఈ ధోరణి ముమ్మాటికీ ప్రజల్ని శాశ్వతంగా పేదవాళ్లుగా” ఉంచడం కోసమేనని ఒక సందర్భంలో మాజీ ఐఏఎస్ అధికారి,లోక్ సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ అన్నారు.

కాంగ్రెస్,బిఆర్ఎస్ కుల రాజకీయాలు చేస్తున్నందున,ప్రజల్లో ‘అసమానత’లను ఆసరా చేసుకొని తెలంగాణలో’ హిందూత్వవాదం’ వేగంగా వ్యాప్తి చెందుతోంది.ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేయడానికి ‘సామాజిక న్యాయాన్ని’ అస్త్రంగా వాడుకున్న కేసీఆర్ ‘కుల అసమానతల’ను పెంచి పోషించారన్న అపవాదు ఉంది.కేసీఆర్ఎ, ఆయన కుటుంబ ‘ఆధిపత్య పోకడలు’,అజమాయిషీ రాజకీయాలతో జనం విసిగిపోయారు.విరక్తి చెందారు.దీంతో ఎస్.సి,ఎస్.టి,బిసి,ఓబిసి,మైనారిటీలు 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుజూపారు.
తెలంగాణలో భూస్వామ్య ‘ప్రాతినిథ్య కులం’ గా ముద్రపడ్డ ‘వెలమ’లు రాష్ట్ర రాజకీయాలను దాదాపు పదేండ్లు శాసించారు.కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీలను అగ్రవర్ణాల పార్టీలుగా చిత్రీకరించి ఇతర సామాజిక తరగతులన్నింటినీ తమవైపునకు మళ్లించేందుకు,ఆ వర్గాలలో పట్టు సాధించేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.సీమాంధ్రకు చెందిన కమ్మ,రెడ్డిల మధ్య అధికార పోరాటం ఉమ్మడి ఏపీలో ఎప్పడూ కొనసాగింది.కానీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చివరి దశలో దళితులు,షెడ్యూల్డ్ తెగలు,వెనుకబడిన కులాలు,మైనారిటీల నుంచి భారీ మద్దతు లభించింది. .

కేసీఆర్ చాణక్యంతో రాష్ట్ర రాజకీయాల్లో ‘రెడ్డి సామాజిక వర్గం’ భవిష్యత్తుతో పాటు,కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కూడా అయోమయంలో పడ్డాయి.పదేళ్ల తర్వాత కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కేవలం ముఖ్యమంత్రిగానే కాకుండా,రెడ్డీల నాయకుడిగా స్థిరపడిపోయారు.అయితే ‘రెడ్డి ప్రతినిథి’ ముద్ర తొలగించుకునే లక్ష్యంతో ‘కులగణన’,బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల వ్యవహారాన్ని ఎజండాపై తీసుకు వచ్చి ‘సామాజికన్యాయం’ బాంబు పేల్చారు.దీంతో బిఆర్ఎస్,బీజేపీ కకావికలమయ్యాయి.అదే సమయంలో 2023 శాసనసభ ఎన్నికల్లో రెడ్డీల ప్రాతినిధ్యం 43 మంది వరకు పెరగడం,వెలమల సంఖ్య 13 మందికి చేరడం గమనార్హం.మొత్తం 119 మంది ఎమ్మెల్యేల్లో 56 మంది ఈ రెండు కులాలవారే.కానీ ఈ రెండు సామూహిక వర్గాలు రాష్ట్ర జనాభాలో చిన్న వాటా మాత్రమే కలిగి ఉన్నాయి.

2014 కు ముందు ‘సామాజిక తెలంగాణ’ అనే నినాదంతో ఉద్యమంలో పాల్గొన్న పలు శ్రామిక,బహుజన వర్గాల ఆశలు నెరవేరక పోవడం నిరాశ కలిగించింది.వారి ఆకాంక్షల్ని విస్మరించి,అధికార దాహంతో కేసీఆర్ పనిచేసిన తీరు విమర్శలపాలయ్యింది. .

“తెలంగాణ రాజకీయాల్లో దశాబ్దాలుగా ఈ ప్రాంతీయ ఎలైట్ వర్గాలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగింది” అని ఒక సందర్భంలో ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి వ్యాఖ్యానించారు.ఇతర కులాల ప్రతినిధులుగా, ‘బహుజన రాజ్యం’ అనే నినాదంతో ముందుకొచ్చిన డా.ఆర్‌.ఎస్‌.ప్రవీణ్ కుమార్ వంటి నాయకుల ప్రయత్నాలు విఫలమయ్యాయి.ఆయన కేసీఆర్ పంచన చేరడం చారిత్రిక విషాదం.కాగా ఓబీసీ,ఎస్సీ,ఎస్టీ వర్గాల్లో హిందుత్వ భావజాలాన్నీ బీజేపీ ప్రజల్లో బలంగా తీసుకువెడుతోంది. . ”బీజేపీ జై శ్రీరాం నెట్వర్కులతో గ్రామీణ తెలంగాణలోనూ స్థిరపడుతుంది.కాంగ్రెస్ వంటి పార్టీలను పక్కనబెట్టి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని చూస్తోంది” అని కూడా చక్రపాణి అన్నారు

‘సామాజిక తెలంగాణ’ అంటే బ్రహ్మ పదార్ధమేమీ కాదు.అన్నీ వర్గాల ప్రజలు,అందరినీ కలుపుకొని,ప్రతిస్పందించే ప్రజాస్వామ్య వ్యవస్థగా,ఆకలి పేదరికం లేని,అసమానతలు లేని వ్యవస్థగా ఏర్పడడమే ‘సామాజిక తెలంగాణ’గా నిర్వచనం ఉన్నది. ఏపీ విభజన ద్వారా ఏర్పడిన రాజకీయ భూభాగాన్ని ‘భౌగోళిక తెలంగాణ’ అంటాం.సామాజిక తెలంగాణ నిర్మాణంలో విఫలమైనందుకు గాను, ప్రజాసమూహాలతో పాటు ఇతర రాజకీయ పార్టీల నుంచి కూడా టీఆర్ఎస్ అనేక సవాళ్లను ఎదుర్కుంటున్నది.తెలంగాణ రాష్ట్ర సమితికి పాతికేండ్ల వయసు.ఇటీవలే రజతోత్సవం జరుపుకుంది.ఉద్యమ పార్టీగా సాగిన టిఆర్ఎస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది.మూడవసారి కేసీఆర్ ప్రజల తిరస్కరణకు గురయ్యారు.’అణగారిన వారికి అండగా నిలవడం’ అనే విధానపరమైన పాలనగా చెప్పుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాల రూపంలో పేద ప్రజలకు డబ్బు పంచడమే మార్గంగా ఎన్నుకున్నది.కేసీఆర్ ది రెండు వైపులా పదునున్న కత్తి లాంటి వ్యూహం.ఈ విధానంలో నాయకుడికి ‘దాతృత్వ ధోరణి ఉన్న రాజు’ లాంటి గౌరవంతో పాటుగా, ‘జనాకర్షక’ నేతగానూ గుర్తింపు లభిస్తుందని ఆయన అనుకున్నారు.కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన,అమలు చేసిన పథకాలన్నీ ఆయన ‘దానగుణానికి’ ప్రతిబింబంగానే చెప్పుకోవాలి.మరోవైపు ప్రజలకు నిజంగా అవసరమైనవి మాత్రమే కాకుండా,ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తాను అనుకున్న పథకాలన్నింటినీ రంగంలో దింపారు. అందుకే విస్తృతమైన పథకాలు అందుబాటులో వచ్చాయి.కానీ తెలంగాణ ప్రజలకు కావలసిన ‘ఆత్మగౌరవాన్ని’ కేసీఆర్ తొక్కిపారేశారన్న ఆరోపణలున్నవి.

కేసీఆర్ హయాంలో పెద్ద సంఖ్యలో జనాభాకు ఉపయోగపడే చాలా పథకాలను ప్రవేశపెట్టారు.అంతకుముందు ఉన్న పథకాలు కూడా కలిపి ఇబ్బడి ముబ్బడిగా అమలు చేశారు.సబ్సిడీ బియ్యం,ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, వృద్ధులకు,వికలాంగులకు, వితంతువులకు అందించే ఆసరా పెన్షన్ పథకం, హిందు,ముస్లిం మైనారిటీ కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కళ్యాణ లక్ష్మీ,షాదీ ముబారక్ పథకం, ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన గొల్ల,కుర్మ,ముతరాసి,బెస్తా,గంగపుత్రుల కోసం గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ పథకం,బీడీ కార్మికులు, చేనేత కార్మికులు,కల్లుగీత కార్మికుల కోసం పలు పెన్షన్ స్కీమ్‌లు ప్రవేశపెట్టారు. వృత్తిపరమైన,కులపరమైన పథకాలు ఆయా వర్గాల వారికి ఆర్థిక సాధికారతను అందజేశాయని బిఆర్ఎస్ ప్రచారం చేసుకుంటోంది. కానీ శాసన సభల్లో,స్థానిక సంస్థల్లో,ఇతర విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవలసిన వేదికల్లో ఎక్కడా ఆయా వర్గాల వారి ప్రాతినిధ్యం లేకుండా చేశారు.కేసీఆర్ హయాంలో అట్టడుగు వర్గాలు నిర్లక్ష్యానికి గురయ్యాయన్న విమర్శలున్నాయి.డబ్బు పంచిపెడితే సామాన్యప్రజలు సంతృప్తి చెందుతారని,తమకు గట్టి ఓటు బ్యాంకులుగా తయారవుతారని కేసీఆర్ అంచనా వేశారు.

విద్య, వైద్యం,నీటి పారుదల,వ్యవసాయ రంగాల్లో వెనుకబాటుతనం,కోస్తాఆంధ్ర పెట్టుబడిదారుల తెలంగాణ ఉద్యమం తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే.ఆంధ్రా పాలక వర్గాలుగా ముద్ర వేసిన టీడీపీ,కాంగ్రెస్ పార్టీల నిర్లక్ష్యానికి పర్యవసానంగానే ఈ ప్రాంతం నిరాదరణకు గురైందని,ఈ రంగాలన్నీ వెనుకబాటులో ఉన్నాయని ఉద్యమ కాలంలో ప్రచారం చేసిన ఘనత కేసీఆర్ దే.తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే,ఈ రంగాలకే ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు.కాళేశ్వరం ప్రాజెక్టు,మిషన్ కాకతీయ,మిషన్ భగీరథ వంటి ప్రాజెక్టులు అందులో భాగమే. రైతు బీమా, రైతు బంధు అనే పథకాలు కూడా అమల్లోకి వచ్చాయి.’రైతుబంధు’పథకం ఎట్లా దుర్వినియోగం అయిందో,ఎన్ని విధాలుగా ఈ పథకం పేరిట కేసీఆర్ బంధుగణం,బినామీలు దోపిడీకి పాల్పడ్డారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో వివరించారు.

వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టిన పథకాల్లో ఉన్న ప్రధాన లోపం సాగుదారు కాకుండా భూమి యజమానే ఈ పథకాలు పొందేందుకు అర్హుడు. ఈ పథకానికి అర్హులైన, దీని అవసరమున్న కౌలు రైతులు, సాగు చేస్తున్న భూమి తమది కాకపోవడంతో ఈ పథకం ఫలాలను పొందలేకపోతున్నారు.భూమి హక్కును కలిగి ఉండి వ్యవసాయానికి దూరంగా ఉన్నవారు దీని ద్వారా లాభాన్ని పొందుతున్నారు.అందుకే ఎమ్మెల్సీ కవిత ‘రైతుబంధు’ లోపాలతో పాటు,భూమి లేని రైతుకూలీలు,కార్మికుల సమస్యలను లేవనెత్తారు.టీఆర్ఎస్ పార్టీలో ఓబీసీల ప్రతినిధి,సుదీర్ఘ కాలంగా కేసీఆర్‌కు విధేయుడిగా ఉన్న కీలక నేత ఈటల రాజేందర్‌ను పార్టీ నుంచి తొలిగించిన తీరు కేసీఆర్ అభద్రతాభావానికి పరాకాష్ట.

సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాల ప్రజల్ని ఆకట్టుకోవడానికి ఆ ఓటు బ్యాంకులు కాంగ్రెస్,బిజేపీ వైపు వెళ్లకుండా బిఆర్ఎస్ ‘హైజాక్’ చేసేందుకు గాను కవితను ఒక ఆయుధంగా కేసీఆర్ మలచినట్టుగా ఒక ప్రచారం నడుస్తోంది.