Site icon HashtagU Telugu

HYD : హైదరాబాద్ లోని ఆ ప్రాంతంలో నెలకు రూ. 5.4 కోట్లు అద్దె.. అది ఎక్కడో తెలుసా..?

Phoenix Centaurus Building

Phoenix Centaurus Building

హైదరాబాద్ ఐటీ రంగంలో వేగంగా ఎదుగుతూ విశ్వనగరంగా మారుతోంది. అనుకూల వాతావరణం, భద్రత, మౌలిక వసతులు, అంతర్జాతీయ ప్రమాణాల ఆఫీస్ స్పేస్ లభ్యత కారణంగా ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీలు హైదరాబాద్ వైపు ఆకర్షితమవుతున్నాయి. తాజాగా అమెరికా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) హైదరాబాద్‌లో తన వ్యాపార విస్తరణకు పెద్ద అడుగు వేసింది. ఈ సంస్థ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఫీనిక్స్ సెంటార్స్ బిల్డింగ్‌(Phoenix Centaurus Building)లో 2.65 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకుంది.

ఈ డీల్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలోనే కాకుండా, దేశంలోని ప్రముఖ లీజింగ్ ఒప్పందాల్లో ఒకటిగా నిలిచింది. చదరపు అడుగుకు రూ.67 చొప్పున, మైక్రోసాఫ్ట్ నెలకు కనీస అద్దెగా రూ.1.77 కోట్లు చెల్లించనుంది. నిర్వహణ ఖర్చులు, ఇతర వ్యయాలు కలిపి మొత్తం రూ.5.4 కోట్ల వరకు వెచ్చించనుంది. అదనంగా ఏటా అద్దె 4.8 శాతం పెరుగుతుంది. ఈ లీజింగ్ ఒప్పందం కింద మైక్రోసాఫ్ట్ రూ.42.15 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించింది. రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ కింద దాదాపు రూ.92.94 లక్షలు చెల్లించినట్లు సమాచారం.

September 2025 Bank Holidays: సెప్టెంబర్ నెలలో ఏకంగా 15 రోజుల వరకు బ్యాంకులకు సెలవులు

హైదరాబాద్‌లో అంతకుముందు కూడా పలు అంతర్జాతీయ కంపెనీలు భారీ ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 2024లో టీసీఎస్ 10.18 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకోగా, ఫేస్‌బుక్ 3.7 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని రీన్యువల్ చేసుకుంది. ఈ ఒప్పందాలతో పాటు తాజా మైక్రోసాఫ్ట్ డీల్ కూడా హైదరాబాద్‌ను గ్లోబల్ టెక్ సిటీగా మరింత బలపరుస్తోంది. అంతర్జాతీయ కంపెనీలు తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను (GCCs) స్థాపించడానికి హైదరాబాద్‌ను మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవడం, రాబోయే రోజుల్లో భాగ్యనగరాన్ని ప్రపంచ ఐటీ మ్యాప్‌లో అగ్రస్థానంలో నిలిపేలా చేస్తోంది.