KCR: కోలుకుంటున్న కేసీఆర్, ఇక కాంగ్రెస్ తో తాడోపేడో!

  • Written By:
  • Updated On - January 6, 2024 / 07:39 PM IST

KCR: అసెంబ్లీ తర్వాత తెలంగాణ ఇప్పటికే లోక్ సభ ఎన్నికల సందడి నెలకొంటుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ఇటీవల అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే ప్రజల మధ్యకు రాబోతున్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రజల మధ్యలోకి వస్తారని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఫిబ్రవరి నెలలో తెలంగాణ భవన్‌కి వచ్చి ప్రతి రోజూ కార్యకర్తలను కలుస్తారని.. త్వరలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలు కూడా ఉంటాయని హరీశ్ రావు తెలిపారు.

హైదరాబాద్‌లో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేసీఆర్ కోలుకుంటున్నారని.. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యలోకి వస్తారని హరీశ్ రావు తెలిపారు. కేసీఆర్ కిట్లపై కేసీఆర్ బొమ్మను తొలగించినా, ప్రజల గుండెల నుంచి కేసీఆర్ ను తొలగించలేరని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపులకు దిగితే ఎమ్మెల్యేలంతా బాధితుల వద్దకు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీస్తామని తేల్చి చెప్పారు.

లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం కావాల‌ని, అసెంబ్లీల వారీగా భేటీలు ఏర్పాటు చేసుకోవాల‌ని పార్టీ నేత‌ల‌ను బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ఆదేశించారు. చేవెళ్ల లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ నేత‌ల‌తో  కేటీఆర్ స‌మావేశ‌మ‌య్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఏమాత్రం కుంగిపోవద్దని… ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థులే నియోజకవర్గ ఇంఛార్జులని… తమ తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలని పార్టీ కేడర్‌కు సూచించారు. జ‌న‌వ‌రి 26వ తేదీలోగా స‌మావేశాలు పూర్తి చేసుకోవాల‌ని కేటీఆర్ సూచించారు.

స‌మీక్ష అనంత‌రం చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. త‌న‌ను చేవెళ్ల ఎంపీ అభ్య‌ర్థిగా పోటీ చేయ‌మ‌ని కేటీఆర్ చెప్పారు. గెలుపే ల‌క్ష్యంగా ప‌ని చేయాల‌ని దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ ఖాళీ అవుతుంద‌ని కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న అస‌త్య ప్ర‌చారాన్ని తిప్పికొట్టాలి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ ఓడిన స్థానాల‌పై ప్ర‌త్యేక దృష్టి పెడుతాం అని రంజిత్ రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే.

ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తన హయాంలో ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను కూడా నీరుగార్చిందని వాటిని పక్కన పెట్టే యోచనలో ఉందని BRS శుక్రవారం ఆరోపించింది. ఈ అంశంపై ప్రజలకు తెలియజేయాలని మరియు అవగాహన కల్పించాలని దాని పార్టీ నాయకులు మరియు కార్యకర్తలకు పిలుపునిచ్చింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు, పార్టీ సీనియర్ నాయకుడు టి. హరీష్ రావు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పార్టీ నిరసనలు నిర్వహించాలని తేల్చి చెప్పారు.