Site icon HashtagU Telugu

Revanth Reddy : కొడంగల్ నుంచే ప్రజాపాలన మీద తిరుగుబాటు మొదలైంది – హరీష్ రావు

Harish Rao Charlapalli

Harish Rao Charlapalli

లగచర్ల కేసులో అరెస్టయిన కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని చర్లపల్లి జైల్లో హరీశ్‌రావు గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి పగ ప్రతీకారంతో కావాలనే పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్ట్‌ చేయించారని ఆరోపించారు. కొడంగల్ నుంచే ప్రజాపాలన మీద తిరుగుబాటు మొదలైందని.. ఈ అరెస్ట్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మేలు జరుగుతుందన్న పాపానికి.. లగచర్ల గ్రామం భూములను గుంజుకోవడమే నువ్వు చేసే మేలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏంజరిగిన అది బిఆర్ఎస్ పార్టీ వల్లనే అని బురద జల్లు తున్నారని.. నిరుద్యోగులు, రైతులు, పోలీసులు స్వచ్ఛందంగా ధర్నా చేస్తే అది బీఆర్‌ఎస్‌ చేయించిందని రేవంత్ అంటున్నారని.. రేవంత్ సొంత నియోజకవర్గంలో తమ భూముల కోసం గిరిజనులు పోరాటం చేస్తే అది కూడా బీఆర్‌ఎస్‌ చేసిందనే అంటున్నారన్నారు. ప్రజలకు అన్యాయం జరిగితే పోరాడడం ప్రతిపక్షాలుగా మా బాధ్యత అన్నారు. మమ్మల్ని అక్రమంగా కేసులు పెట్టాలనుకుంటున్నావేమో .. మాపై కోపం ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి‌.. కానీ అమాయక గిరిజన రైతులపై కేసులెలా పెడతారని ప్రశ్నించారు.

మల్లన్నసాగర్‌లో రేవంత్‌ రెండురోజులు నిరసన చేస్తే మేం అడ్డుకున్నమా.. ? అని ప్రశ్నించారు. అర్ధరాత్రి మహిళల చాతిమీద కాళ్లు పెట్టి అరెస్టులు చేయడం సరికాదన్నారు. ఈ ప్రజల తిరుగుబాటు ఆగదని.. రేవంత్‌ని గద్దె దించే దాకా నిద్రపోమన్నారు. మా ప్రభుత్వంలో 14వేల ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరించామని.. అక్కడెందుకు ఫార్మాసిటీ కట్టరని ప్రశ్నించారు. ఇందిరమ్మ ముసుగులో దళితుల, గిరిజనుల భూములు గుంజుకుంటున్నారని.. ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన ఇప్పుడు కనిపిస్తోందన్నారు.

Read Also : Salt: ఉప్పును చేతికి ఎందుకు ఇవ్వరు.. అలా ఇస్తే ఏమవుతుందో తెలుసా?