ఈనెల 16న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్‌లో తొలిసారి అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు నమోదు చేస్తున్నామని TSPSC తెలిపింది. ఉదయం 8.30 నుంచే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు. 10.15 నిమిషాలకు గేట్లు మూసివేస్తామని ఆ తర్వాత ఎవర్నీ లోపలికి అనుమతించమని తెలిపారు. ప్రిలిమ్స్ జరిగాక ఫిబ్రవరిలో గ్రూప్-1 మెయిన్స్ నిర్వహించాలని భావిస్తున్నట్లు TSPSC పేర్కొంది.
అయితే.. ఈ ఆదివారం జరగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్‌పై టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి స్పందించారు. హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్న అభ్యర్థులు హాల్‌టికెట్‌లో ఏమైనా తప్పులుంటే తప్పనిసరిగా గెజిటెడ్ అధికారితో సంతకం చేయించుకోవాలని సూచించారు. పరీక్షా సమయానికి 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్ చేస్తామన్నారు. ఉదయం 10.15 నిమిషాల తర్వాత పరీక్ష సెంటర్‌లోకి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఈ సారి బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంటుదని ఆయన పేర్కొన్నారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయ్యాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్ధన్ రెడ్డి ఆయా జిల్లా కలెక్టర్లకు వివరించారు. రాష్ట్రం మొత్తం మీద గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు మొత్తం 1040 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణ గ్రూప్ -1 పరీక్షకు సంబంధించి మొత్తం 503 పోస్టులకు 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్-1 ప్రకటనలో మొత్తం 503 పోస్టుల్లో మహిళలకు 225 రిజర్వ్ అయ్యాయి.