Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీడియా సంస్థ అధినేత, ఓ కీలక నేత!

Phone Tapping Case : గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు టార్గెట్‌గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరిన్ని విషయాలు విచారణలో వెలుగుచూశాయి.

Published By: HashtagU Telugu Desk
Phone Tapping

Phone Tapping Case

Phone Tapping Case : గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు టార్గెట్‌గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరిన్ని విషయాలు విచారణలో వెలుగుచూశాయి. పోలీసు కస్టడీలో ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును సిట్‌ అధికారులు మూడో రోజైన మంగళవారం బంజారాహిల్స్‌ ఠాణాలో ప్రశ్నించడంతో ముఖ్యమైన సమాచారం చెప్పారని తెలుస్తోంది. ప్రణీత్‌కు ఇన్‌ఫార్మర్‌గా పని చేసి.. అతడితో కలిసి బెదిరింపు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మీడియా సంస్థ యజమాని ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారట. ప్రణీత్‌ ఎస్‌ఐబీ కార్యాలయంతో పాటు సదరు మీడియా సంస్థ ఆఫీస్, వరంగల్, సిరిసిల్లలోనూ కొన్ని కంప్యూటర్లు, సర్వర్లు ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి ఆదేశాల మేరకు మరో నేత సహకారంతో ఇవి ఏర్పాటు చేశారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇవి ఆయా ప్రాంతాల్లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అక్కడ ఉంచి ఏం చేశారు? అనే కోణాల్లో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ మీడియా సంస్థ యజమాని ఇచ్చిన దాదాపు 100 నెంబర్లను సైతం ప్రణీత్ రావు ట్యాప్ చేశారని విచారణలో గుర్తించారు.  దీనికి సంబంధించి ప్రణీత్ రావు డైరీ నుంచి వందల సంఖ్యలో ఫోన్ నెంబర్లను పోలీసులు గుర్తించారు.

We’re now on WhatsApp. Click to Join

ప్రముఖ రాజకీయ నేత ఆదేశాల మేరకు తెలంగాణ స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావుతో పాటు ప్రణీత్‌రావు అండ్‌ టీమ్‌ సర్వీస్‌ ప్రొవైడర్లతో సంబంధం లేకుండానే అక్రమంగా ఫోన్ ట్యాపింగ్‌(Phone Tapping Case) చేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్లను విదేశాల నుంచి ఖరీదు చేశారని భావిస్తున్నారు. ఎస్‌ఐబీ కార్యాలయంలో ప్రణీత్‌ ఏర్పాటు చేసుకున్న 17 కంప్యూటర్లలో ఈ సాఫ్ట్‌వేర్లు ఉండొచ్చని, ఆ విషయం బయటకు రాకూడదని సంబంధిత 42  హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేసి నగర శివార్లలోని అటవీ ప్రాంతంలో పారేసినట్లు సిట్‌ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తున్న ఇద్దరు ఇన్‌స్పెక్టర్లను సిట్‌ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది.

Also Read :MB Foundation : పిల్లల గుండె ఆరోగ్యంపై మహేష్ బాబు ఫౌండేషన్ మరో మంచి పని..

తెలంగాణ స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు 2014కు ముందు ప్రాధాన్యత కలిగిన పోస్టింగ్స్‌ చాలా తక్కువ చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎస్పీగా ఆయన అప్పట్లో వ్యవహరించారు. ప్రభాకర్‌రావుకు ప్రణీత్‌ అక్కడే పరిచయమయ్యాడు. ప్రభాకర్‌రావు ఎస్‌ఐబీ చీఫ్‌గా మారిన తర్వాత నల్లగొండలో తనకు నమ్మకస్తులుగా మారిన కొందరిని ఆ విభాగంలోకి తెచ్చుకున్నారు. వీళ్లందరూ ఫోన్ ట్యాపింగ్‌లో కీలక పాత్ర పోషించారని సమాచారం. ఇలాంటి అధికారుల్లో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు ప్రస్తుతం వరంగల్‌ పరిధిలో పని చేస్తున్నారని తెలుస్తోంది.

Also Read :Tamilisai: పార్లమెంట్ బరిలో తమిళిసై, ఏ స్థానం నుంచో అంటే!

  Last Updated: 20 Mar 2024, 07:31 AM IST