Telangana High Court సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే ధరలు పెంచుతూ ప్రభుత్వాలు మెమోలు జారీ చేయడంపై న్యాయస్థానం అసహనం చెందింది. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు వినడం లేదని, ప్రజలపై ఆర్థిక భారం పడేలా నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించింది.
తెలంగాణలో భారీ బడ్జెట్ సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరల పెంపు అంశం ప్రహసనంగా మారిన సంగతి తెలిసిందే. రేట్లు పెంచాలని ప్రభుత్వానికి ఫిలిం మేకర్స్ దరఖాస్తు చేసుకోవడం, ధరలు పెంచుకోడానికి ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేయడం, దానిపై ఎవరో ఒకరు కోర్టుకు వెళ్లడం, న్యాయస్థానం ఆ జీవోని సస్పెండ్ చేయడం.. ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాల విషయంలో ఇదే ప్రక్రియ కనిపిస్తోంది. ‘ది రాజాసాబ్’ విడుదల నేపథ్యంలో మరోసారి ఈ అంశం రచ్చకెక్కింది. సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ మెమోలు జారీ చేయడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రభాస్ హీరోగా నటించిన ‘ది రాజాసాబ్’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి వచ్చింది. నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టికెట్ రేట్లు పెంచుకోడానికి పర్మిషన్ ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. దీంతో రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పుబట్టింది. పదే పదే టికెట్ ధరలను ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడంపై అసహనం వ్యక్తం చేసింది.
తెలంగాణాలో సినిమా టికెట్ల రేట్లు పెంచబోమని స్వయంగా సంబంధిత మంత్రి ప్రకటించినప్పటికీ, మళ్ళీ ధరల పెంపునకు అనుమతిస్తూ మెమోలు ఎలా జారీ చేస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా? తెలివిగా మెమోలు ఎందుకు జారీ చేస్తున్నారు? అని ప్రభుత్వ ప్లీడర్‌ను నిలదీసించింది. ఎన్నిసార్లు చెప్పినా మీ ఆలోచన ఎందుకు మారడం లేదంటూ మండిపడింది. ప్రజలపై ఆర్థిక భారం పడేలా తీసుకుంటున్న ఈ నిర్ణయాల వెనుక ఆంతర్యం ఏమిటి? మెమో ఇచ్చే అధికారికి రూల్స్ తెలియవా? అంటూ హైకోర్ట్ ప్రశ్నించింది.
