Site icon HashtagU Telugu

Osmania Hospital Foundation: ఈ నెలాఖరులోగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన: సీఎం రేవంత్‌

Osmania Hospital Foundation

Osmania Hospital Foundation

Osmania Hospital Foundation: ఈనెలాఖరులోగా కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన (Osmania Hospital Foundation) చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై శనివారం తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోషామహల్ లో ప్రతిపాదిత స్థలానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ శాఖ పరిధిలో ఉన్న ఆ స్థలాన్ని వైద్యఆరోగ్య శాఖకు వీలైనంత త్వరగా బదిలీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రెండు శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు.

ప్రతిపాదిత స్థలంలో చేపట్టాల్సిన నిర్మాణాలకు సంబంధించిన నమూనా మ్యాప్ లను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అధికారులు సూచించిన మ్యాప్ లలో పలు మార్పులు, చేర్పులను సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అన్ని రకాల ఆధునిక వసతులతో ఉండేలా ఆసుపత్రి నిర్మాణం ఉండాలన్నారు. రోడ్లు, పార్కింగ్, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నమూనాలను రూపొందించాలని ఆదేశించారు. భవిష్యత్తులో రోడ్డు విస్తరణ, ఫ్లై ఓవర్ లాంటి నిర్మాణాలు చేపట్టినా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ముందుచూపుతో డిజైన్లను రూపొందించాలన్నారు.

Also Read: Sanjay Raut : ఒంటరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ : సంజయ్ రౌత్

అత్యాధునిక వసతులతో పాటు రోగుల సహాయకులు సేదతీరేందుకు గ్రీనరీ, పార్క్ లాంటి సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అత్యాధునిక వసతులతో ఆసుపత్రి నిర్మాణం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవనాలు, ఇతర నమూనాలకు సంబంధించి పూర్తి స్థాయి డిజైన్లను రూపొందించాలన్నారు. ఈ నెలాఖరులోగా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.