Kavithas Letter: బీఆర్ఎస్ పార్టీలో ఏదో జరుగుతోంది ? కేసీఆర్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ రాజకీయ పార్టీలో విభేదాలు ఎట్టకేలకు బయటపడ్డాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కల్వకుంట్ల కవిత రాసిన లేఖతో ఈవిషయం తేటతెల్లమైంది. వరంగల్‌లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ చేసిన ప్రసంగంలోని వివిధ అంశాల గురించి ఈ లేఖలో కవిత ప్రస్తావించారు. బీజేపీ గురించి 2 నిమిషాలే కేసీఆర్ మాట్లాడటాన్ని కవిత తప్పుపట్టారు. దీనివల్ల భవిష్యత్తులో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం మొదలైందని ఆమె తెలిపారు.ప్రసంగంలో బీజేపీని ఇంకొంచెం టార్గెట్ చేస్తే బాగుండేదని కవిత చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడంతో.. బీజేపీకి బీఆర్ఎస్ సాయం చేస్తోందని కాంగ్రెస్ ప్రచారం చేసుకుందని ఆమె తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ బలహీనపడిందని, దానికి బీజేపీ ప్రత్యామ్నాయం అవుతుందేమో అనే ఆందోళన బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉందని కవిత పేర్కొన్నారు. తద్వారా భవిష్యత్తులో బీజేపీకి బీఆర్ఎస్ దగ్గరైతే తన దారిని తాను చూసుకుంటాననే సిగ్నల్స్‌ను కవిత పంపారు.
Also Read :National Herald Case : రేవంత్ అవినీతి సామ్రాజ్యం బట్టబయలైంది – కేటీఆర్
‘ధూం ధాం’ విఫలమైందని..
ఇక బీఆర్ఎస్ కార్యకర్తలను ఆకట్టుకోవడంలో ‘ధూం ధాం’ విఫలమైందని కవిత(Kavithas Letter) మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభా ప్రాంగణానికి కవిత చేరుకోగానే.. కవిత వర్గానికి చెందిన ఓ కళాకారుడు వేదికపైకి వెళ్లి కవితకు స్వాగతం పలకాలని కోరాడు. అందుకు బీఆర్ఎస్‌కు చెందిన ధూంధాం టీమ్ నో చెప్పింది. సదరు వ్యక్తిని వేదిక కిందికి పంపింది. కేటీఆర్‌కు బీఆర్ఎస్‌పై పెరిగిన పట్టుకు ఈ పరిణామం నిదర్శనమని కవిత భావించారు. అందుకే రజతోత్సవ సభలో బీఆర్ఎస్ కార్యకర్తలను ఆకట్టుకోవడంలో ‘ధూం ధాం’ విఫలమైందని ఆమె అభిప్రాయపడ్డారు.
Also Read :Bangladesh : రాజీనామా యోచనలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత..?
బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంఛార్జిల నియామకంపైనా..
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా కవిత తన లేఖలో ప్రస్తావించారు. బీఆర్ఎస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి పదవులను భర్తీ చేసిన తీరును ఆమె ఖండించారు. మళ్లీ పాతవాళ్లకే ఆ బాధ్యతలను ఇవ్వడాన్ని కవిత తప్పుపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల బీ-ఫాంలను కేటాయించే బాధ్యతలను అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జిలకు ఇవ్వాలనే ఆలోచన సరికాదన్నారు. సుదీర్ఘ లేఖ రాసినందుకు సారీ! ధన్యవాదాలు అని లేఖ చివర్లో కవిత ప్రస్తావించారు. తద్వారా కేసీఆర్ పోకడలు, బీఆర్ఎస్‌లో కేటీఆర్ ఆధిపత్యాన్ని కవిత వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టమవుతోంది. బీఆర్ఎస్ పార్టీలో తనకు కేటీఆర్‌తో సమానమైన హోదా, ప్రాధాన్యం దక్కకుంటే ప్రత్యామ్నాయ రాజకీయ వేదికల గురించి కవిత ఆలోచించే అవకాశం ఉందని క్లియర్ అవుతోంది. ఒకవేళ సొంత రాజకీయ దారిని చూసుకుంటే.. తన వెంట వచ్చే బీఆర్ఎస్ నాయకులను కూడా ఆమె రెడీ చేసుకుంటున్నారట.