BJP In Telangana: బీజేపీ, టీఆర్ఎస్ స్పీడ్ కు తెలంగాణ కాంగ్రెస్ ఔట్!

హుజురాబాద్ ఉప ఫ‌లితాల త‌రువాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హ‌డావుడి దాదాపు క‌నుమ‌రుగు అయింది. తెలంగాణ రాజ‌కీయ వేదిక‌పైన బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ మాత్ర‌మే ప్ర‌స్తుతం క‌నిపిస్తున్నాయి.

  • Written By:
  • Updated On - November 17, 2021 / 04:39 PM IST

హుజురాబాద్ ఉప ఫ‌లితాల త‌రువాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హ‌డావుడి దాదాపు క‌నుమ‌రుగు అయింది. తెలంగాణ రాజ‌కీయ వేదిక‌పైన బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ మాత్ర‌మే ప్ర‌స్తుతం క‌నిపిస్తున్నాయి. రెండు వారాలుగా వ‌రి ధాన్యం కొనుగోలు విష‌యంలో రెండు పార్టీలు ప్ర‌జా క్షేత్రానికి వెళ్లి త‌ల‌పడుతున్నాయి. రైతుల స‌మ‌స్య మీద ఫోక‌స్ పెట్టాయి. హుజురాబాద్ ఓట‌మికి వ‌రి ధాన్యం కొనుగోళ్లు ఆల‌స్యాన్ని ప్ర‌ధాన కార‌ణంగా టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఆ అంశ‌మే క‌లిసి వ‌చ్చింద‌ని బీజేపీ అంచ‌నా వేస్తోంది. ఈ క్ర‌మంలో ఆ రెండు పార్టీలు తాడోపేడో తేల్చుకోవ‌డానికి వ‌రి క్షేత్రంలోకి దిగాయి. కాంగ్రెస్ పార్టీ ఆ విష‌యంలో బాగా వెనుక‌బ‌డింది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ఆలోచించ‌డంలేదు. వాస్త‌వంగా అసెంబ్లీలో కేవ‌లం ముగ్గురు ఎమ్మెల్యేల‌ను మాత్ర‌మే బీజేపీ క‌లిగి ఉంది. అదే, కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉండి కూడా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల గురించి ప‌ట్టించుకోవ‌డంలేదు. విచిత్రంగా స్థానిక సంస్థ‌ల కోటా కింద జ‌రిగే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ అభ్య‌ర్థుల‌ను పెట్ట‌డానికి వెనుకాడుతోంది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ లు కొంద‌రు కాంగ్రెస్ పార్టీ వాళ్లు గెలిచారు. వాళ్ల‌కు ఊతం ఇచ్చేలా అభ్య‌ర్థుల‌ను నిల‌ప‌డానికి కూడా కాంగ్రెస్ ధైర్యం చేయ‌లేక‌పోతోంది.
స్థానిక సంస్థల నుంచి 12, ఎమ్మెల్యే కోటాలో 6, గవర్నర్ కోటా నుంచి ఒకరికి మొత్తం 19 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. సంఖ్యా బలం కారణంగా అవన్నీ అధికార టీఆర్‌ఎస్ పార్టీకే దక్కే అవకాశముంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థ‌ల క్షేత్రంలోనూ, అసెంబ్లీ వేదిక‌పైనా పోటీ చేయ‌డానికి ఆస‌క్తిగా లేదు. వ‌రుస ప‌రాజ‌యాల‌తో నిరుత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి రూపంలో ఊపు వ‌చ్చింద‌ని భావించారు. కానీ, హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థికి వ‌చ్చిన ఓట్ల‌తో ఆ పార్టీని ఎవ‌రూ బాగుచేయ‌లేర‌ని స్ప‌ష్టం అయింది. ఆ విష‌యం తెలుసుకున్న అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంపై తొలి రోజుల్లో ఉన్న న‌మ్మ‌కాన్ని కోల్పోయింద‌ని ఢిల్లీ వ‌ర్గాల స‌మాచారం.

హుజురాబాద్ ఉప ఫ‌లితాల స‌మీక్ష‌లో రేవంత్ రెడ్డిని పూర్వం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్లు టార్గెట్ చేశారు. అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌డం నుంచి ప్ర‌చారం వ‌ర‌కు రేవంత్ చేసిన త‌ప్పుల‌ను ఎత్తిచూపార‌ని తెలిసింది. అంతేకాదు, హుజూర్ న‌గ‌ర్ , నాగార్జున‌సాగ‌ర్‌, ఇటీవ‌ల జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు త‌దిత‌రాల‌ను స‌మీక్షించార‌ట‌. ఆ ఎన్నిక‌ల‌న్నింటిలోనూ వ‌ర్కింగ్ సిడెంట్ హోదాలో రేవంత్ రెడ్డి ప్ర‌చారం చేశాడు. తాజాగా హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో పీసీసీ చీఫ్ గా ప్ర‌చారం చేసినప్ప‌టికీ ఏమైంద‌ని సీనియ‌ర్లు ప్ర‌శ్నిస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ వ‌ర్గం వ‌ర్సెస్ కాంగ్రెస్ వ‌ర్గం అన్న‌ట్టు అంత‌ర్గ‌తంగా ఉంది. క్షేత్ర స్థాయిలో రేవంత్ కు అంత సీన్ లేద‌నే విష‌యాన్ని ప‌దేప‌దే ఏఐసీసీకి సీనియ‌ర్లు చెబుతున్నారు. ఆ విష‌యం హుజురాబాద్ ఉప ఎన్నిక‌తో నిరూప‌ణ అయింది. దీంతో ఇప్పుడు ఏం చేయాలో తిక్కుతోచ‌ని విధంగా తెలంగాణ కాంగ్రెస్ ఉంది. వ‌రి ధాన్యం విష‌యంలో బీజేపీ స్పీడ్ కు కాంగ్రెస్ పార్టీ మ‌రింత వెనుక‌బ‌డింది. ఇదే పరిస్థితి కొన‌సాగితే ఎన్నిక‌ల క్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ నామ‌మాత్రం కానుంది. ఏపీలో మాదిరిగా తెలంగాణ కాంగ్రెస్ అవుతుంద‌ని సీనియ‌ర్లు అంచ‌నా వేయ‌డాన్ని త‌ప్పుబ‌ట్ట‌లేం.