Site icon HashtagU Telugu

Tamilisai Vs Harish Rao: ఉస్మానియా ఆస్పత్రిపై తమిళిసై ట్వీట్, హరీశ్ రావు కౌంటర్!

governor harish rao

governor harish rao

తెలంగాణ గవర్నర్ తమిళిసై అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాలపై స్వారీ చేస్తూ సమస్యలను పరిష్కరించాలని నిలదీస్తున్నారు. వివిధ సమస్యలపై గవర్నర్ హోదాలో స్పందిస్తూ అధికార పార్టీని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పలు సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తమిళిసై తాజాగా ఉస్మానియా ఆస్పత్రిలోని సమస్యలు, వైద్య సదుపాయాలు గురించి మాట్లాడారు.

ఉస్మానియా ఆస్పత్రి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. ఎంతో గొప్ప చరిత్ర గల ఉస్మానియా ఆస్పత్రిని వెంటనే పునరుద్దరించాలని కోరారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ నెటిజన్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. వివరాలు.. ‘‘జస్టిస్ ఫర్ ఓజీహెచ్’’ పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్‌లో ఉస్మానియా ఆస్పత్రికి సంబంధించి గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలుపుకోవాలని కోరుతూ పోస్టు చేశారు. ‘‘ఉస్మానియా జనరల్ ఆస్పత్రి పునర్నిర్మాణం గురించి గతంలో చేసిన హామీలను మరోసారి గుర్తించి చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వానికి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాము’’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు. జాయింట్ అసోషియేషన్ ఫర్ న్యూ ఓజీహెచ్ పేరుతో కూడిన లేఖను కూడా షేర్ చేశారు.

ఈ పోస్టులో తెలంగాణ సీఎంవో, గవర్నర్ తమిళిసై, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు అకౌంట్‌‌లను ట్యాగ్ చేశారు. అయితే ఈ పోస్టుపై స్పందించిన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. ఉస్మానియా ఆస్పత్రి పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. శతాబ్దాల నాటి ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ దుస్థితిని చూసి ఆందోళన చెందుతున్నానని పేర్కొన్నారు. శిక్షణ, వైద్యానికి ఎంతో గర్వకారణమైన ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని కోరారు.

వైద్య రంగంలో ఎంతో అభివృద్ధి కనిపిస్తుంటే.. గవర్నర్ ఎందుకు అభినందించరంటూ గవర్నర్ తమిళిసై మంత్రి హరీష్‌రావు ఫైర్ అయ్యారు. ఉస్మానియా ఆస్పత్రిపై గవర్నర్ తమిళిసై చేసిన ట్వీట్ పై స్పందించిన మంత్రి హరీష్ రావు.. అభివృద్ధి కనిపించడం లేదా..? అంటూ ప్రశ్నించారు. ఉస్మానియా ఆస్పత్రి పై గవర్నర్ వ్యాఖ్యలు దురదృష్టకరమని, మెరుగైన ఆరోగ్య తెలంగాణ కోసం ఆరోగ్యశాఖ పని చేస్తోందంటూ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

Also Read: Asin Reaction: డివోర్స్ రూమర్స్ పై నటి ఆసిన్ రియాక్షన్ ఇదే!