Telangana Culture: రాష్ట్రపతి భవన్‌లో “వివిధతా కా అమృత్ మహోత్సవ్” ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్, ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. బుధవారం నాడు భారత రాష్ట్రపతి “ద్రౌపది ముర్ము” ముఖ్య అతిధిగా రాష్ట్రపతి భవన్ లోని అమృత్ ఉద్యాన్ లో ఏర్పాటు చేసిన “వివిధతా కా అమృత్ ఉత్సవ్” ప్రారంభం కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ప్రధాన కార్యక్రమానికి ముందు గౌరవ రాష్ట్రపతి అన్ని రాష్ట్రాల స్టాళ్ళను సందర్శించారు. కాగా తెలంగాణ పెవిలియన్‌కు విచ్చేసిన రాష్ట్రపతిని గవర్నర్, ఉప ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించి తెలంగాణ చేనేత కళాకారుల పనితనాన్ని, చేతివృత్తుల ప్రాముఖ్యతను (Telangana Culture) స్వయంగా వారికి వివరించారు.
అగ్గి పెట్టెలో పట్టే విధంగా చేతితో చీర నేసిన సిరిసిల్ల నేతకారుల పనితీరును రాష్ట్రపతి ప్రముఖంగా ప్రశంసించి, నేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపముఖ్యమంత్రి స్టాళ్ళన్నింటినీ కలియతరిగి వాటి నిర్వాహకులతో ముచ్చటించారు. ప్రధాన కార్యక్రమం అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ప్రదర్శించిన “గుస్సాడి” నృత్యం చూపరులను ఆకట్టుకుంటుంది. నేటి ఉత్సవ ప్రారంభ కార్యక్రమానికి అన్ని దక్షిణాది రాష్ట్రాల గవర్నర్లు, సంబంధిత మంత్రులు హాజరయ్యారు.
Also Read: Ropeway: యాత్రికులకు గుడ్ న్యూస్.. 9 గంటల ప్రయాణం ఇకపై 36 నిమిషాలే!
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ చేపట్టిన “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్”లో భాగంగా గత సంవత్సరం నుండి భారత రాష్ట్రపతి కార్యాలయ ఆధ్వర్యంలో ఈ వివిధతకా అమృత్ ఉత్సవాలు జరుపుతున్నారు. భారతదేశంలోని సాంస్కృతిక, భాషా, సంప్రదాయ వైవిధ్యాన్ని పురస్కరించుకుంటూ “భిన్నత్వంలో ఏకత్వం” అనే స్ఫూర్తిని చాటి చెప్పటమే ఈ కార్యక్రమ లక్ష్యం. ఈ రోజు ప్రారంభమయ్యే ఉత్సవాలలో అన్ని దక్షిణ భారత భారత రాష్ట్రాలు పాల్గొంటున్నాయి. అందరికీ ఉచితంగా ప్రవేశ సదుపాయం కల్పించారు.
ఈ నెల 6వ తేదీ నుండి 9వతేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం సైతం పెవిలియన్ ఏర్పాటు చేసింది. ఈ పెవిలియన్ లో రాష్ట్రానికి చెందిన పద్మశ్రీ పురస్కార గ్రహీతలు గజం అంజయ్య,గజం గోవర్ధన్ లతో సహ 20మంది వివిధ ప్రాంతాల ప్రముఖ చేనేత కార్మికులు,20 మంది హాస్తకళా నిపుణులచే స్టాళ్ళు ఏర్పాటు చేయబడ్డాయి. అంతే కాకుండా ముగ్గురు హస్తకళా నిపుణులు స్వయంగా ఆయా వస్తువుల తయారీ పద్ధతిని అతిధులకు చూపించనున్నారు.అదే విధంగా అతిధులకు నోరురించే విధంగా తెలంగాణ రుచులతో కూడిన ఫుడ్ స్టాల్ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అతిధులను అలంరించడానికి రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ కళా రూపాలైన ఒగ్గు డోలు,పేరిణి, గుస్సాడీ ప్రదర్శనలు ఉంటాయి.