Minister Sridhar Babu: ప్రభుత్వ విభాగాలకు కంప్యూటర్ హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ లను సరఫరా చేసే నోడల్ ఏజెన్సీ తెలంగాణా టెక్నాలజీ సర్వీసెస్ (టీజీటీఎస్) తన పరిధిని మరింత విసృతపర్చుకోవాలని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) ఆదేశించారు. గత ఏడాది రూ.5 కోట్ల లాభం ఆర్జించిన సంస్థ కార్యకలాపాలను పెంచుకోవడం ద్వారా టర్నోవర్ వృద్ధిని సాధించాలని సూచించారు. శుక్రవారం నాడు ఆయన టీజీటీఎస్ పనితీరును సైఫాబాద్ హాకా భవన్ లోని కార్యాలయంలో సమీక్షించారు. ప్రభుత్వ విభాగాలన్నీ సంస్థ ద్వారా కంప్యూటర్ సంబంధిత పరికరాలు, సాఫ్ట్ వేర్లను సేకరించుకునేలా సమన్వయం చేసుకోవాలని అన్నారు. దీనిపై ఐటీ, పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తో చర్చించాలని తెలిపారు.
ప్రస్తుతం 44 ప్రభుత్వ విభాగాలు, 140 విభాగాలకు టీజీటీఎస్ సేవలు అందిస్తోందని సంస్థ ఎండీ శంకరయ్య మంత్రి దృష్టికి తెచ్చారు. వీటిలో కొన్ని సొంతంగా కొనుగోళ్లు జరుపుతామని చెబ్తున్నాయని చెప్పారు. దీనిపై స్పందించిన శ్రీధర్ బాబు కొద్ది మొత్తంలో కొనుగోళ్ల కంటే భారీ ఆర్డర్ల ద్వారా రాయితీలు, తక్కువ ధరకే ఎలక్ట్రానిక్ పరికరాలు సేకరించవచ్చని ఆయా శాఖాధిపతులకు వివరించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ విభాగాల ఆధునీకరణకు కేంద్రం నిధులు అందిస్తే ఆర్డర్లు సంపాదించుకోవడం ద్వారా పనితీరు మెరుగు పర్చుకోవాలని ఆదేశించారు. టీజీటీఎస్ ప్రస్తుతం పోలీసు, పలు ప్రభుత్వ విభాగాలకు కంప్యూటర్ సంబంధిత పరికాలకు తోడు సిసి కెమెరాలు, ఫోరెన్సిక్ సైన్స్ విభాగానికి నేర నిర్దారణ పరీక్షలకు సంబంధించిన పరికరాలు కొనుగోలు చేసి అందజేస్తోంది.
Also Read: Group 1 Exam : గ్రూప్-1 అభ్యర్థుల మీద లాఠీచార్జి చెయడంపై బండి సంజయ్ ఆగ్రహం
సంస్థ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి ఛైర్మన్ మన్నె సతీశ్ కుమార్ తో కలిసి ఉద్యోగులందరిని పరామర్శించారు. వారికి సమస్యలేమైనా ఉన్నాయోమో అని అడిగి తెలుసుకున్నారు. సమీక్షా సమేవేశంలో ఛైర్మన్ సతీశ్ కుమార్ తో పాటు, ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవీశ్ మిశ్రా, ఎండీ శంకరయ్యలు పాల్గొన్నారు.