హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఇక కరెంట్ వైర్లు కనిపించవు. భారీ వర్షాలు లేదా బలమైన గాలుల కారణంగా తరచుగా సంభవించే విద్యుత్ అంతరాయాలకు, చెట్లు, స్తంభాలు కూలడానికి శాశ్వత పరిష్కారం దిశగా టీజీఎస్పీడీసీఎల్ (Tgspdcl ) కీలక అడుగు వేసింది. ఓవర్హెడ్ విద్యుత్ లైన్లకు బదులుగా భూగర్భ కేబుళ్లను (అండర్‌గ్రౌండ్ కేబుల్స్) ఏర్పాటు చేయడానికి విస్తృత ప్రణాళికలు రచిస్తోంది. బెంగళూరులో భూగర్భ కేబుళ్ల వ్యవస్థ విజయవంతంగా పనిచేస్తున్న తీరును డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్వయంగా పరిశీలించి వచ్చిన తర్వాత ఈ దిశగా నిర్ణయం తీసుకున్నారు.
Masala Foods : మసాలా ఫుడ్స్‌లో టమోట సాస్ ఎక్కువగా తింటున్నవారికి షాకింగ్ న్యూస్
ప్రస్తుతం నగరంలో ఉన్న ఓవర్హెడ్ విద్యుత్ లైన్ల వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. వర్షాలు, గాలుల వల్ల చెట్లు, స్తంభాలు కూలి విద్యుత్ సరఫరా నిలిచిపోవడం సర్వసాధారణం. అంతేకాకుండా, వేసవిలో చెట్ల కొమ్మలను తొలగించడానికి ఏటా పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేయాల్సి వస్తోంది. తెగిపడే విద్యుత్ తీగల వల్ల పాదచారులకు, భవనాలపై బట్టలు ఆరేసే మహిళలకు, పతంగులు ఎగురవేసే యువతకు విద్యుత్ షాక్‌లు తగిలి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. భూగర్భ కేబుళ్లను ఏర్పాటు చేయడం ద్వారా ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇది విద్యుత్ సరఫరాలో అంతరాయాలను తగ్గించి, భద్రతను మెరుగుపరుస్తుందని చెబుతున్నారు.
ముందుగా నగరంలోని ప్రధాన రహదారులపై ఉన్న ఓవర్హెడ్ కేబుళ్లను తొలగించి, భూగర్భ కేబుళ్లను వేయాలని టీజీఎస్పీడీసీఎల్ నిర్ణయించింది. దీని తర్వాత దశలవారీగా బస్తీలు, కాలనీల్లోనూ ఈ వ్యవస్థను విస్తరించనున్నారు. ప్రస్తుతం నగరంలోని ఏఏ ప్రాంతాల్లో ఓవర్హెడ్ కేబుళ్లు ఉన్నవి, ఎక్కడెక్కడ భూగర్భ కేబుళ్లు వేయాలన్న విషయంపై ఫీడర్ల వారీగా సర్వే నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టును పర్యవేక్షించడానికి సర్కిళ్ల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఐదుగురు అధికారులు సబ్స్టేషన్లు, ఫీడర్లు, ఓవర్హెడ్ లైన్లు, విద్యుత్ స్తంభాలను గుర్తించి, భూగర్భ లైన్ల ఏర్పాటుకు ఎంత ఖర్చవుతుందన్న నివేదికను సమర్పించనున్నారు. ఈ నివేదికల ఆధారంగా గ్రేటర్లో భూగర్భ కేబుళ్ల వ్యవస్థ ఏర్పాటుపై ముందుకు వెళ్ళనున్నారు.