TGPSC : బీఆర్‌ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డికి టీజీపీఎస్సీ పరువునష్టం దావా నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలని, లేకపోతే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదని రాకేశ్ రెడ్డిపై ఆంక్షలు విధించింది. తమపై నిరాధార ఆరోపణలు చేశారని టీజీపీఎస్సీ మండిపడింది. ఈ క్రమంలోనే రాకేశ్ రెడ్డికి పరువు నష్టం నోటీసులు పంపింది. తదుపరి టీజీపీఎస్సీపై రాకేష్ రెడ్డి ఎటువంటి ఆరోపణలు చేయొద్దని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టద్దని ఆంక్షలు విధించింది.
ఇటీవల రాకేష్ రెడ్డి గ్రూప్ 1 మెయిన్స్‌లోని అన్ని పేపర్లను రీ వాల్యుయేషన్ చేయాలని, వాల్యుయేషన్‌లో జరిగిన తప్పిదాలను ప్రభుత్వం సరిద్దాలని మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. గ్రూప్ 1లో తెలుగు మీడియం అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. గ్రూప్ -1 మెయిన్స్ రాసిన వారిలో 40 శాతం తెలుగు మీడియం అభ్యర్థులు ఉన్నారని.. కానీ వారిలో ఒక్కరు కూడా టాప్ ర్యాంకులో రాలేదని తెలిపారు. ఇది ఎంపిక ప్రక్రియపై సందేహాలను కలిగిస్తోందని చెప్పారు. కొన్ని ప్రత్యేక పరీక్షా కేంద్రాల నుండి పలువురు అభ్యర్థులు విజయం సాధించారన్నారు. కేవలం రెండు కేంద్రాల నుంచే 74 మంది టాపర్లు రావడం మరియు 15 కేంద్రాల నుండి అందరూ ర్యాంకర్లు ఉండటంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.
ఫలితాలు రాకముందే కాంగ్రెస్ సోషల్ మీడియా ఖాతాలు ఎలా అంచనా వేయగలిగాయని ఆయన ప్రశ్నించారు. టీజీపీఎస్సీ నుండి సమాచారం లీక్ అయి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఒకే కేంద్రానికి చెందిన అభ్యర్థులకు ఒకే విధమైన మార్కులు రావడం కూడా అనుమానాలకు తావిస్తోందన్నారు. మూడవ మూల్యాంకనాన్ని నిర్వహించలేదని, రెండవ రౌండ్ మూల్యాంకనాన్ని కూడా కాంట్రాక్ట్ సిబ్బందితో నిర్వహించారని, రెగ్యులర్ ప్రొఫెసర్‌లతో కాదని ఆయన ఆరోపించారు. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ జరిగి ఉండవచ్చనే అనుమానాలకు దారితీస్తోందన్నారు.
18, 19వ కేంద్రాల్లో అవకతవలకు జరిగాయనే అనుమానం ఉందన్నారు. ఏపీపీఎస్సీలో 6 వేల పేపర్లను దిద్దేందుకు 40 రోజుల సమయం తీసుకుంటే.. ఇప్పుడు 20 వేల పేపర్లను అతి తక్కువ సమయంలో ఎలా దిద్దారని ప్రశ్నించారు. గ్రూప్ పరీక్షల నిర్వహణే తప్పుల తడక అంటూ రాకేష్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై టీజీపీఎస్సీ సీరియస్ అయ్యింది. తప్పుడు ఆరోపణలపై సమాధానం చెప్పాల్సిందే అంటూ రాకేష్ రెడ్డికి టీజీపీఎస్సీ పరువునష్టం దావా నోటీసులు జారీ చేసింది.