Site icon HashtagU Telugu

TGPSC Group-1 Mains 2024: గ్రూప్-1 మెయిన్స్‌కు హైకోర్టులో లైన్ క్లియర్.. 31,383 మంది అభ్యర్థులు హాజ‌రు..!

TGPSC Group-1 Mains 2024

TGPSC Group-1 Mains 2024

TGPSC Group-1 Mains 2024: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 పరీక్షల (TGPSC Group-1 Mains 2024) నిర్వహణకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ పరీక్షలపై హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించింది. 8 మంది కోసం లక్షల మంది భవిష్యత్తును నాశనం చేయలేమని చెప్పింది. ఈ పరీక్షల కోసం ఎంతో మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని, అందుకే పరీక్షలను వాయిదా వేయాలని చెప్పలేమని పేర్కొంది.

ఇక‌పోతే ఈనెల 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు జరిగే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను ఏ విధమైన పొరపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా నిర్వహించ‌నున్న‌ట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం స్పష్టం చేశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో గురువారం సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కార్యాలయం నుండి కమీషన్ చైర్మన్ డా. మహేందర్ రెడ్డి, సభ్యులు పాల్గొనగా, సచివాలయం నుండి డీజీపీ జితేందర్, కమీషన్ కార్యదర్శి నవీన్ నికోలస్, SPDCL MD ముష్రాఫ్ అలీ, రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కర్ణన్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు అనుదీప్, శశాంక్, గౌతమ్ తదితర అధికారులు హాజరయ్యారు.

Also Read: KTR : మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్: మూసీ పై కేటీఆర్‌ ప్రజెంటేషన్

ఈ సందర్బంగా సీఎస్‌ శాంతి కుమారి మాట్లాడుతూ.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరవుతుండగా, దీని కోసం 46 పరీక్షా కేంద్రాలను హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఏర్పాటు చేశామని వివరించారు. ఈ పరీక్షలు నిర్వహించే అన్ని కేంద్రాల వద్ద ఏ విధమైన అవకతవకలు, అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు, విస్తృత స్థాయిలో సీనియర్ అధికారులతో పర్యవేక్షణను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

జిల్లా కలెక్టర్లు నేరుగా ఈ పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారని, సంబంధిత పోలీస్ కమీషనర్లు కూడా తగు బందోబస్తు ఏర్పాట్లను చేపడుతారని తెలిపారు. అన్ని శాఖల అధికారులు ఏవిధమైన స్వల్ప సంఘటనలు జరుగకుండా అత్యంత అప్రమత్తంగా ఈ పరీక్షల నిర్వహణా విధులు నిర్వహించాలని పేర్కొన్నారు.

హైదరాబాద్ జిల్లాలో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 మొత్తం 46 కేంద్రాలలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాలన్నింటిలోనూ సీసీ టీవీలను ఏర్పాటు చేసి, TGPSC కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. పరీక్షల నిర్వహణలో ప్రతి స్టెప్ లోనూ కచ్చితమైన నియమ నిబంధనలు పాటించేలా స్పష్టమైన మార్గదర్శకాలు అందచేశామని అధికారులు తెలిపారు.