హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల విడుదలకు వేళ దగ్గరపడింది. ఇంటర్ ఫస్ట్ మరియు సెకండ్ ఇయర్ జనరల్, వొకేషనల్ కోర్సులకు సంబంధించిన ఫలితాలను ఇంటర్ బోర్డు సోమవారం (జూన్ 16) విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలు ఆన్‌లైన్‌లో విడుదల కానున్నాయి.
విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లైన https://tgbie.cgg.gov.in లేదా http://results.cgg.gov.inలో చెక్ చేసుకోవచ్చు.
ఈసారి రాష్ట్రవ్యాప్తంగా ఫెయిలైన విద్యార్థులతో పాటు మార్కులు మెరుగుపర్చుకోవాలనుకునే విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఈ పరీక్షలకు హాజరయ్యారు. మే 22 నుండి 29 వరకు నిర్వహించిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 4.2 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఇటీవలి జోసా కౌన్సెలింగ్, ఈఏపీసెట్, నీట్ వంటి ప్రవేశ పరీక్షలలో ఇంటర్ మార్కుల ప్రాధాన్యం పెరగడంతో, ఈ ఫలితాలపై విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.