తెలంగాణ సర్కార్ (Telangana Government ) సంక్రాంతి (Sankranthi) సంబరాలకు సిద్ధం అవుతుంది. సంక్రాంతి అంటే తెలుగు ప్రజలకు పెద్ద పండగ. ఈ పండగను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు సైతం ఎంతో సంబరంగా జరుపుకుంటుంటారు. అలాంటి సంక్రాంతిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరింత సంబరంగా , సంతోషంగా జరుపుకునేలా సీఎం రేవంత్ (CM Revanth) సరికొత్త పథకాలను సంక్రాంతి సందర్బంగా అందజేయబోతున్నారు. రాష్ట్రంలోని పేదలకు ఆర్థిక సహాయం, రేషన్ కార్డుల పంపిణీ వంటి పథకాలను అమలు చేయనున్నట్లు సర్కార్ ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న ముఖ్య నిర్ణయాల్లో భూమిలేని పేదలకు ప్రతి ఏడాది రూ. 12,000 ఆర్థిక సహాయం అందించడం ఒకటి. రైతులకు మాత్రమే కాకుండా భూమిలేని వారి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 28న ఈ పథకాన్ని ప్రారంభించి పేదల జీవితాల్లో మార్పు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ద్వారా లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా అందనుంది.
సంక్రాంతి కి రేషన్ కార్డుల సమస్యకు కూడా తెలంగాణ ప్రభుత్వం పరిష్కారం చూపనుంది. సుమారు 30 లక్షల కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. గతంలో అర్హత ఉన్నా రేషన్ కార్డులు లేని కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇటీవల జరిగిన కుటుంబ సర్వే ద్వారా ఈ అంశం ప్రభుత్వం దృష్టికి రావడంతో సంక్రాంతి తర్వాత ఈ కార్డులను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.రైతుల కోసం మరోసారి రైతు బంధు పథకాన్ని విడుదల చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రుణమాఫీతో పాటు రైతు బంధు పథకం ద్వారా రైతుల కష్టాలను తీరుస్తామని తెలిపారు. వ్యవసాయం ప్రధాన ఆధారంగా ఉన్న తెలంగాణలో సంక్రాంతి పండుగ రైతులకు పంటల పండుగగా నిలుస్తుంది. ఈ పథకాల ద్వారా రైతన్నలలో చిరునవ్వులు పూయాలని ప్రభుత్వం సంకల్పించింది. మొత్తానికి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం పేదలు, రైతులు, సామాన్య ప్రజలకు వరాల జల్లు కురిపిస్తోంది.
Read Also : Congress : 19న కాంగ్రెస్ ఎంపీలతో రాహుల్‌గాంధీ భేటీ