తెలంగాణలోని ఓ గవర్నమెంట్ హాస్టల్లోని విద్యార్థులు మందుతో విందు చేసుకున్నారు. బీర్లు తాగుతూ…చికెన్ తింటూ చిందులు వేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై బీసీ సంక్షేమశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. సదరు విద్యార్థులపై చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. మంచిర్యాల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దండేపల్లి మండల కేంద్రంలోని బీసీ బాలుర హాస్టల్ లో పలువురు విద్యార్థులు బీర్లు, చికెన్ తింటూ విందు చేసుకున్నారు. అంతేకాదు సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపులలో షేర్ చేశారు. దీంతో అవి కాస్త వైరల్ గా మారాయి. విద్యార్థులు మందు విందు గురించి అధికారులకు వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో మందు విందుపై మంచిర్యాల జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి విచారణకు ఆదేశించారు.
ఈ ఘటన ఈనెల 17 ఆదివారం నాడు జరిగింది. ఆదివారం కావడంతో హాస్టల్ సిబ్బంది విద్యార్థులకు చికెన్ వండారు. అందరు విద్యార్థుల మెస్ వద్దే తిన్నారు. కానీ కొంతమంది విద్యార్థులు మాత్రం తినడానికి అక్కడి రాలేదు. రాత్రి భోజనాన్ని తమ గదిలోకి తీసుకెళ్లారు. స్థానికంగా నివాసముండే విద్యార్థుల సాయంతో హాస్టల్ లోకి బీరు బాటిళ్లు తెప్పించుకున్నారు. మందు తాగుతూ..చికెన్ తింటూ సెల్ఫీలు తీసుకున్నారు. ఈ ఫోటోలను తమ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసారు. వాట్సాప్ గ్రూపుల నుంచి సోషల్ మీడియాకు పాకాయి. ఈ వ్యవహారం అంతా కూడా అధికారుల వద్దకు చేరింది. అంతేకాదు కొందరు యువకులు కలెక్టర్, ఉన్నతాధికారుల వాట్సాప్ తోపాటు ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఈ ఘటనపై జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఖాజా నజీం అలీ అప్షర్ విచారణకు ఆదేశించారు. అసిస్టెంట్ బీసీ డెవలప్ మెంట్ అధికారి భ్యాగవతి హాస్టల్ ను సందర్శించి వార్డెన్ తోపాటు సిబ్బందిని విచారించారు.
ఈ ఘటనపై విద్యార్థులను కూడా ఆరా తీసారు. దీనికి సంబంధించి పూర్తి నివేదికను త్వరలోనే ఉన్నతాధికారులకు అందచేస్తామని అసిస్టెంట్ బీసీ డెవలప్ మెంట్ అధికారి భాగ్యవతి తెలిపారు. ఇక గవర్నమెంట్ హాస్టల్ లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన చోటుచేసుకోవడానికి విద్యార్థులు బీర్లు హాస్టల్ లోకి తీసుకురావడాన్ని గమనిస్తే…ఈ హాస్టల్ ఇళ్ల మధ్య ఉండటం కూడా కారణంగా తెలుస్తోంది.