Site icon HashtagU Telugu

Chandrababu Revanth Reddy : శిష్యుల‌కు `గురువు` కిత‌కిత‌లు

Revanth Babu Kcr

Revanth Babu Kcr

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయ‌ని ఆ పార్టీ అంచ‌నా వేస్తోంది. చాలా కాలం త‌రువాత ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్ర‌బాబునాయుడు హైద‌రాబాద్ పార్టీ ఆఫీస్ కు రావ‌డం ప్రారంభించారు. మ‌ళ్లీ పూర్వ వైభ‌వం తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి రావాల‌ని సీనియర్ల‌కు దిశానిర్దేశం చేశారు. గ‌త ఏడేళ్లుగా ఎప్పుడూ సీరియ‌స్ గా తీసుకోని చంద్ర‌బాబునాయుడు ఈసారి కొంత భిన్నంగా క‌నిపించార‌ని సీనియ‌ర్లు భావిస్తున్నారు. నెల‌కు క‌నీసం ఒక‌సారి తెలంగాణ టీడీపీ సీనియ‌ర్ల‌తో స‌మావేశం కావ‌డం ద్వారా పార్టీని బ‌లోపేతం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలుస్తోంది.
ఓటుకు నోటు కేసు త‌రువాత చంద్ర‌బాబు తెలంగాణ వైపు చూడ‌లేదు. ప్ర‌జా వ్య‌తిరేక విధానాలు కేసీఆర్ తీసుకుంటున్న‌ప్ప‌టికీ టీడీపీ జాతీయ అధ్య‌క్షుడుగా ఉన్న ఆయ‌న మౌనంగా ఉండిపోయారు. కేవ‌లం ఏపీ వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యారు. టీడీపీ తెలంగాణ శాఖ‌కు పూర్తి స్వేచ్ఛ‌ను ఇచ్చారు. ఆయ‌న ఎప్పుడు ఇన్వాల్వ కాలేదు. దానికి ప‌లు ర‌కాల కార‌ణాల‌ను ప్రైవేటుగా చెప్పుకుంటారు. ఇప్పుడు మారిన రాజ‌కీయ ప‌రిస్థితులు, ఓటుకు నోటు కేసు దాదాపుగా కోర్టుల్లో నిర్వీర్యం కావ‌డంతో చంద్ర‌బాబు మ‌ళ్లీ తెలంగాణ‌పై ఫోక‌స్ పెట్టార‌ని టాక్.

తెలంగాణ టీడీపికి రాష్ట్ర, జిల్లా కార్య‌వ‌ర్గాలు ఉన్నాయి. నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జిలు కూడా చాలా చోట్ల ఉన్నారు. మిగిలిన చోట్ల కూడా భ‌ర్తీ చేయాల‌ని భావిస్తున్నారు. ఆ మేర‌కు రెండు రోజుల క్రితం చంద్ర‌బాబు స‌మ‌క్షంలో జ‌రిగిన టీడీపీ తెలంగాణ విభాగం స‌మావేశంలో నిర్ణ‌యించారు. మ‌హానాడు నాటికి పూర్తి స్థాయిలో పార్టీ బ‌లం కాబోతుంద‌నే సంకేతం ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి మ‌హానాడును గండిపేట‌లో నిర్వ‌హించాల‌ని భావిస్తున్నారు. రెండు రాష్ట్రాల శాఖ‌లు క‌లిసి గండిపేట కేంద్రంగా మ‌హానాడు కార్య‌క్ర‌మాన్ని పెద్ద ఎత్తున నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌తి ఏడాది మే 27, 28, 29 తేదీల్లో మ‌హ‌నాడు జ‌రుగుతుంది. ఈసారి స్వ‌ర్గీయ ఎన్టీఆర్ శ‌తజ‌యంతి ఉత్స‌వాలను ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని పార్టీ యోచిస్తుంది.తెలుగుదేశం పార్టీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకు, సానుభూతిప‌రులు తెలంగాణ‌లో ఎక్కువ‌గానే ఉన్నారు. వాళ్ల‌ను న‌డిపించే నాయ‌కులు పార్టీలో స‌రిగా లేరు. సుదీర్ఘ కాలంగా టీడీపీలో ప‌నిచేసిన సీనియ‌ర్లు 90శాతం మంది టీఆర్ ఎస్ పార్టీకి వెళ్లిపోయారు. వాళ్లు కొంద‌రు తిరిగి సొంత గూటికి వ‌చ్చే అవ‌కాశాలు లేక‌పోలేదు. రాష్ట్రం విడిపోయిన త‌రువాత టీఆర్ఎస్ పార్టీకి సెంటిమెంట్ బాగా ప‌నిచేసింది. అది ప్ర‌స్తుతం కేసీఆర్ ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న కార‌ణంగా క‌రిగిపోయింది. అందుకే, బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల పార్టీగా గుర్తింపు ఉన్న టీడీపీని ప్ర‌జ‌లు ఆద‌రిస్తార‌ని ఆ పార్టీ భావిస్తోంది. ఆంధ్రా సెంటిమెంట్ ను రెచ్చ‌గొట్టడం ద్వారా కేసీఆర్ రాజ‌కీయంగా ఇప్ప‌టి వ‌ర‌కు ల‌బ్ది పొందారు. ఈసారిఆ సెంటిమెంట్ ప‌నిచేయద‌ని టీడీపీ అంచ‌నా.

స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకోవ‌డం చంద్ర‌బాబుకు అల‌వాటు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌లో బ‌లంగా ఉంది. ఒక శిష్యుడు టీఆర్ఎస్ పార్టీకి చీఫ్ కేసీఆర్‌ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ చీఫ్ గా మ‌రో శిష్యుడు రేవంత్ ఉన్నారు. 2018 ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు కోసం టీడీపీ ప్ర‌య‌త్నం చేసింది. కానీ, ఆ రోజున కేసీఆర్ నిరాక‌రిచ‌డంతో కాంగ్రెస్ పార్టీతో జ‌ట్టు క‌ట్టింది. ఇప్పుడు అదే భాగ‌స్వామ్యాన్ని కొన‌సాగించేలా టీడీపీ తెలంగాణ విభాగం ఎత్తుగ‌డ‌లు వేస్తోంది. పైగా రేవంత్ రెడ్డికి తెలుగుదేశం బ్రాండ్ గా ముద్ర ఉంది. ఇలా, ఒక వైపు పొత్తులు ఇంకో వైపు పార్టీ బ‌లోపేతం గురించి చంద్ర‌బాబు హైద‌రాబాద్ పార్టీ ఆఫీస్ లో క‌స‌ర‌త్తును ప్రారంభించారు. ఫ‌లితంగా ఈసారి ఏపీలోనే కాదు, తెలంగాణ‌లోనూ టీడీపీ బ‌ల‌ప‌డుతుంద‌ని ఆ పార్టీ సీనియ‌ర్లు విశ్వసిస్తున్నారు.