వీళ్లు పాడితే.. తెలంగాణ గొంతెత్తి పాడదా..!

తెలంగాణ  అంటేనే సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. ఇక్కడి చెట్టు, పుట్ట, గుట్ట ప్రతిదీ ఆధ్యాత్మికతను పులుముకుని ఉంటుంది. ప్రపంచంలో చోలా చోట్లా పూలతో దేవుళ్లను పూజిస్తారు. కానీ ఒక్క తెలంగాణ లో మాత్రం మన ఆడబిడ్డలు పూలనే దైవంగా భావిస్తారు.

  • Written By:
  • Updated On - October 14, 2021 / 12:09 PM IST

తెలంగాణ  అంటేనే సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. ఇక్కడి చెట్టు, పుట్ట, గుట్ట ప్రతిదీ ఆధ్యాత్మికతను పులుముకుని ఉంటుంది. ప్రపంచంలో చోలా చోట్లా పూలతో దేవుళ్లను పూజిస్తారు. కానీ ఒక్క తెలంగాణ లో మాత్రం మన ఆడబిడ్డలు పూలనే దైవంగా భావిస్తారు. అందుకే తొమ్మిదిరోజుల పాటు బతుకమ్మ ను ఘనంగా నిర్వహిస్తారు. ఊరంతా ఒక దగ్గర చేరి బతుకమ్మా.. బతుకమ్మా.. ఉయ్యాలో అంటూ ఇష్టమైన పాటలు పాడుకొని మురిసిపోతుంటారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత బతుకమ్మ ప్రస్థానం లోకల్ టు గ్లోబల్ గా మారింది. అయితే బతుకమ్మ పండుగ కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తామో, వాటి పాటల కోసం అంతే ఆసక్తిగా ఎదురుచూస్తాం. బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల ఈ ఏడాది ప్రత్యేక పాటను రూపొందించారు. ఏఆర్ రహమాన్ స్వరపర్చిన ఈ బతుకమ్మ పాట తెలంగాణ జనాలకు అంతగా నచ్చలేదనే చెప్పాలి. బతుకమ్మ అంటేనే పూర్తిగా జానపదంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఫోక్ సింగర్స్ మంగ్లీ, కనకవ్వ, మౌనిక పాడిన బతుకమ్మ పాటలు తెలంగాణ అంతటా మార్మోగుతున్నాయి. వీళ్లు పాడితే బతుకమ్మే ఆడిపాడుతున్నట్టు ఉంటుంది.

జానపదానికి కేరాఫ్ మంగ్లీ

మంగ్లీగా ఫేమ్ చెందిన సత్యవతి రాథోడ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. లవ్ స్టోరీలోని ‘సారంగ దరియా’,  క్రాక్ మూవీలో ‘భూమ్ బాదల్’ లాంటి పాటలతో ఆకట్టుకుంది. మంగ్లీ సినిమా పాటలు పాడటమే కాకుండా. జానపద పాటలు సైతం అద్భుతంగా పాడుతుంది. అందుకే ప్రతి బతుకమ్మ, ఉగాది పండుగలకు ఆమె తన గొంతు వినిపిస్తుంది. దాదాపు పదిహేను సంవత్సరాలుగా పాటలు పాడుతోంది మంగ్లీ. బతుకమ్మ పాటలు పాడమే కాకుండా స్వయంగా పాటకు తగ్గట్టు డాన్స్ కూడా చేస్తుంది. ఇప్పటివరకు ఆమె పాడిన పాటల్లో ‘‘పచ్చిపాలా వెన్నెల, సింగిడిలో రంగులనే దూసి తెచ్చి’’ అనే పాటలు మంగ్లీకి మంచి పేరు తీసుకొచ్చాయి. ఇప్పటికీ ఈ పాటలు మారుమూల పల్లెల్లోనూ వినిపిస్తుండటం విశేషం.

ఫోక్ సింగర్ మౌనిక

సింగర్ మౌనిక సింగ్ యాదవ్ గొంతులో జనపదాలు ప్రాణం పోసుకుంటాయి. గోదావరి గలగలల మాదరిగా ఆమె నోటి నుంచే జాలువారే జనపదాలు ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇప్పటివరకు మౌనిక 20కుపైగా బతుకమ్మ పాటలను పాడారు. ఈమె పాడటమే కాకుండా.. బతుకమ్మ ఆల్బమ్స్ లోనూ నటిస్తుంది కూడా. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ప్రతి ఏడాది ఓ కొత్త పాటను తెలంగాణ ప్రజలకు అందిస్తుంది మౌనిక. కొన్ని పాటలకు డీజే రిమిక్స్ చేస్తూ తనదైన శైలిలో ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు మౌనిక పాడిన పాటల్లో ‘పూత పులన్నీ పూసే’,  ‘నగిరే నాగ నందనో’ లాంటి పాటలు హైలైట్ గా నిలిచాయి.

కనకవ్వ జోరు

ప్రతిభకు వయసు ఏమాత్రం అడ్డు కాదని నిరూపిస్తోంది గొట్టె కనకవ్వ. మూడేళ్ల క్రితం ఓ తెలుగు యూట్యూబ్ ఛానెల్ లో జానపదం పాట పాడటంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. 64 ఏళ్ల వయస్సున్న కనకవ్వ ఇప్పటివరకు ఎనిమిది బతుకమ్మ పాటలు పాడారు. వాటిలో చాలా పాటలు హిట్ అయ్యాయి. ఆమెకు రాయరాదు, చదవడం కూడా రాదు. కానీ పాటలు పాడటంతో మాత్రం ముందుంటుంది. తన తల్లి నుంచి నేర్చుకున్న జానపద పాటలే తనకు గుర్తింపు తీసుకొచ్చాయని అంటోంది. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో నివసిస్తున్న కనకవ్వ పాడిన ‘కొంగుల్లో సుట్టుండ్రే కోమలాంగి’ ‘టంగుటుయాల టుంగుటుయాల’ పాటలు బాగా పాపులర్ అయ్యాయి.